
రిటైర్‌మెంటా... అంటే?
బ్రిటన్ రాణి ఎలిజబెత్ భర్త ప్రిన్స్ ఫిలిప్ వయోభారం దృష్ట్యా ఇకపై రాచ విధులకు దూరంగా ఉండాలని గురువారం నిర్ణయించుకున్నారు. ఈ ఏడాది జూన్‌లో ఆయన 96వ ఏట అడుగుపెడతారు. 60 ఏళ్లు రాగానే రిటైర్‌మెంట్ తీసుకొని... విశ్రాంత జీవితం గడపాలని ఎందరో కోరుకుంటారు. కానీ కొందరు మాత్రం అందుకు భిన్నం. సుదీర్ఘకాల విధుల్లో ఉన్నా... వయసు సెంచరీ దాటేసినా... పనిలోనే ఆనందాన్ని వెతుక్కుంటున్నారు వీరు. 80–90 ఏళ్లుగా అదే పని. అయినా ఏమాత్రం విసుగు, విరామం ఉండదు. అలాంటి వయోధికులు కొందరి గురించి...
డేవిడ్ గుడాల్: 103 ఏళ్ల పర్యావరణ శాస్త్రవేత్త ఇప్పటికీ పెర్త్ (ఆస్ట్రేలియా)లోని ఎడిత్ కోవాన్ యూనివర్శిటీలో గౌరవ రీసెర్చ్ అసోసియేట్‌గా పనిచేస్తున్నారు. 70 ఏళ్ల కెరీర్‌లో 100కు పైగా పరిశోధన పత్రాలను వెలువరించిన గుడాల్ రోజూ వర్శిటీకి డ్రైవ్ చేసుకుంటూ రావడం క్షేమకరం కాదని భావించిన అధికారులు ఇంటి నుంచి పనిచేయాల్సిందిగా కోరగా.... ఆయన నిరాకరించారు. దాంతో వర్శిటీయే దిగివచ్చి గుడాల్ ఇంటికి దగ్గర్లో ఆఫీసును చూసిపెట్టింది. నాటకరంగంలోనూ ఇటీవలి దాకా చురుకుగా ఉన్న గుడాల్ కంటిచూపు మందగించిన కారణంగా రిహార్సల్స్‌కు చాలాదూరం డ్రైవ్ చేయాల్సిన పరిస్థితుల్లో ఈ అభిరుచికి దూరమయ్యారు.
ఆంథోని మాంచినెల్లి: న్యూయార్క్‌లోని ఆరెంజ్ కౌంటీకి చెందిన 106 ఏళ్ల ఆంథోని క్షురక వృత్తిలో ఉన్నారు. ఊహతెలిసినప్పటి నుంచి సెలూన్లో పనిచేయడమే. 90 ఏళ్లుగా క్షురకుడిగా పనిచేస్తున్న ఈయన 2012లోనే సుదీర్ఘకాలం క్షురక వృత్తిలో ఉన్న వ్యక్తిగా గిన్నిస్ రికార్డులకెక్కారు. ‘పని చేయడం ఆపొద్దు. మీరు చేస్తున్న పనికి వయసు అడ్డంకిగా మారిందా... మరో పనిని ఎంచుకొండి. అంతేకాని రిటైర్ కావొద్దు’ అని ఇటీవల ఆంథోని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
మస్తానమ్మ: మనకే తెలియని తెలుగు మాస్టర్ చెఫ్ ఈ 106 ఏళ్ల బామ్మ. ఆంధ్రప్రదేశ్‌లోని గుడివాడ గ్రామానికి చెందిన ఈమె యూట్యూబ్ ఛానల్ ‘కంట్రీ ఫుడ్స్’ నెట్టింట్లో ఓ సంచలనం. ఏకంగా 2,80,000 మంది సబ్‌స్రై్కబర్స్ ఉన్నారీ ఛానల్‌కు. బామ్మ చేతి వంట రుచి ఎరిగిన ఈమె మునిమనవడు కె.లక్ష్మణ్... కంట్రీ ఫుడ్స్ ఛానల్ నిర్వహణ బాధ్యతలు చూస్తారు. పచ్చటి పంటపోటాల మధ్య, లేదా మామిటి, అరటి తోటల్లో మస్తానమ్మ ఓ చెట్టు కింద కూర్చొని తన పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని ప్రదర్శిస్తుంటారు. సంప్రదాయ, స్థానిక వంటకాలను మస్తానమ్మ సిద్ధం చేస్తుంటారు. ఎగ్ దోస, చేపల వేపుడు, బంబూ చికెన్ బిర్యానీ, పుచ్చకాయలో వండిన చికెన్... ఇలా బామ్మ ఎన్నింటినో అలవోకగా వండివారుస్తుంది. సీ ఫుడ్‌లో స్పెషలిస్టు. ప్రతి వంటకానికి కావాల్సిన పదార్థాలేమిటి, ఎంత మోతాదులో వాడాలో చేతిలోకి తీసుకొని చూపెడుతుంది. లక్ష్మణ్ బృందం బామ్మ వంట వీడియోలను షూట్ చేసి యూట్యూబ్‌లో పెడుతుంది. మొదట్లో మనవడు చేస్తున్నదేమిటో మస్తానమ్మకు అర్థమయ్యేది కాదు. కాని కొంతకాలం తర్వాత అర్థమైంది. అప్పుడామె ఎంతో సంతోషపడిందని లక్ష్మణ్ చెప్పారు. నెట్లో ఇప్పుడీ బామ్మకు చాలా క్రేజుంది.
జాక్ బెర్‌ట్రాండ్ వీన్‌స్టయిన్: న్యూయార్క్‌లోని ఈస్ట్రన్ డిస్ట్రిక్ట్‌లో ఫెడరల్ జడ్జిగా పనిచేస్తున్నారీ 95 ఏళ్ల యువ న్యాయమూర్తి. 1967లో జడ్జిగా నియమితులైన ఈయన వివిధ కోర్టుల్లో న్యాయమూర్తిగా 50 ఏళ్లు పూర్తిచేసుకున్నారు. ఇప్పటికీ అదే ఉత్సాహంతో న్యాయస్థానానికి హాజరవుతారు. చట్టాల్లో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు ఆకళింపు చేసుకుంటూ రిటైర్‌మెంట్ ఆలోచన లేకుండా ముందుకు సాగుతున్నారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అమెరికా నావికాదళంలో పనిచేసి లెఫ్టినెంట్‌గా రిటైరయ్యారు. తర్వాత న్యాయరంగాన్ని కెరీర్‌గా ఎంచుకున్నారు.
షిగీకి హినోరా: ప్రపంచంలోనే అత్యంత పెద్దవయస్కుడైన ప్రాక్టీసింగ్ ఫిజీషియన్ 105 ఏళ్ల హినోరా. టోక్యోలోని సెయింట్ ల్యూక్ ఇంటర్నేషనల్ ఆసుపత్రి ప్రెసిడెంట్‌గా పనిచేస్తున్నారు. ఐదు ఫౌండేషన్‌లకు చైర్మన్. పెద్దసంఖ్యలో పుస్తకాలు రాశారు. వేలకొద్ది పత్రాలు సమర్పించారు. ఈ వయసులోనూ ఆయన ప్రతిరోజు ఆసుపత్రికి వస్తారు. తన పేషెంట్లను చూడటానికి రౌండ్లకు కూడా వెళతారు. అపార అనుభవం కారణంగా హినోరాను‘జాతి సంపద’గా సహచర డాక్టర్లు అభివర్ణిస్తుంటారు.
అలా ఇలినించా లెవుష్కినా: మాస్కో మెడికల్ ఇనిస్టిట్యూట్‌లో వైద్యవిద్యను అభ్యసించిన లెవుష్కినా 89 ఏళ్ల వయసులోనూ శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు. జీర్ణ, విసర్జన వ్యవస్థల నిఫుణురాలు. రష్యాలోని రయాజాన్ అనే పట్టణంలో ఈమె నివసిస్తున్నారు. ఉదయం 8 గంటలకే క్లినిక్‌లో పేషెంట్లను చూడటం ప్రారంభం అవుతుంది. 11 గంటలకు ఆసుపత్రికి వెళ్లి ఆపరేషన్లకు ఉపయుక్తమవుతారు. వారంలో నాలుగురోజులు ఆపరేషన్లు చేస్తుంటారు. 67 ఏళ్ల కెరీర్‌లో 10 వేల పైచిలుకు ఆపరేషన్లు నిర్వహించారు.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్