ఆ విషయంలో ముసలివాళ్లే మేలట..!
న్యూయార్క్: భావ వ్యక్తీకరణలో వయో వృద్ధులే మేలంటున్నారు పరిశోధకులు. యువత కన్నా.. అరవై ఏళ్ళ వయసు దాటినవారే బాధ, ఒంటరితనం వంటి అన్ని రకాల భావాలను వ్యక్త పరచడంలో సానుకూల స్పందన కలిగిఉంటున్నారని తాజా అధ్యయనాల్లో కనుగొన్నట్లు చెబుతున్నారు. భావోద్వేగాల విషయంలోనూ వృద్ధులే అత్యంత అనుకూలమైన, చురుకైన ప్రవర్తన కలిగి ఉంటున్నారని చెప్తున్నారు. యువతలో ఎమోషన్స్ ఎక్కువగా ఉంటున్నాయని, వృద్ధులు నిర్మలమైన అనుభూతులను, ప్రశాంతతను కలిగి ఉన్నట్లు అమెరికా మసాచెట్స్ ఆమ్హెస్గ్ విశ్వవిద్యాలయం ప్రధాన పరిశోధకుడు రెబెక్కా రెడీ ఓ నివేదికలో వెల్లడించారు.
60 నుంచి 90 ఏళ్ళ వయసువారితోపాటు, 18 నుంచి 32 ఏళ్ళ వారిలో అనుకూల, ప్రతికూల భావోద్వేగాలపై పరిశోధనలు జరిపిన అధ్యయనకారులు వివరాలను ఏజింగ్ అండ్ మెంటల్ హెల్త్ జర్నల్ లో ప్రచురించారు. పరిశోధనల్లో వృద్ధులు యువతకన్నా సంతోషంగా, ఆనందంగా ఉండటమే కాక, ఎంతో నిర్మలమైన మనసుతోనూ, సానుకూల భావోద్వేగాలను కలిగి ఉండటాన్ని గమనించినట్లు వెల్లడించారు. యువ, వృద్ధ బృందాల్లో అనేక లక్షణాల్లో పోలిక ఉన్నప్పటికీ విచారం, ఒంటరితనం, ప్రశాంతత వంటి వాటిలో మాత్రం విభేధాలను గమనించినట్లు చెప్తున్నారు. యువత.. సిగ్గు, విచారం, చికాకు, ఒంటరితనం వంటి వాటిని వ్యక్త పరచడంలో స్వీయ నిందను వెలిబుచ్చడం చూసి ఎంతో ఆశ్చర్యపోయినట్లు ప్రధాన పరిశోధకుడు రెడీ చెప్తున్నారు. ఇటువంటి విషయాల్లో వృద్ధులే సాపేక్ష స్వభావాన్ని కలిగి ఉండటాన్ని ఆయన ప్రశంసించారు.
అమెరికాలోని వృద్ధుల్లో భావోద్వేగాలను తెలుసుకోవడం వల్ల వైద్య పరంగా గణనీయమైన ఫలితాలను అందించే అవకాశం ఉంటుందని పరిశోధక బృందం వెల్లడించింది. మానసిక వైద్యులకు, కేర్ టేకర్లకు, వర్కర్లకు వృద్ధుల సంరక్షణా బాధ్యతలు నిర్వహించడంలో వారి స్వభావ పరిశీలన ఎంతో అవసరమని, తమ పరిశోధన అందుకు సహాయపడుతుందని చెప్తున్నారు.