ఇది మహేష్‌బాబు సినిమా కథ కాదు.. అమెరికాలోని మోనోవై అనే ఊరు కథ.. మరీ ముఖ్యంగా ఆ ఊర్లో ఉండే ఎల్సీ ఐలర్ అనే బామ్మ కథ..
అంత స్పెషల్ ఏంటట..
నెబ్రాస్కా రాష్ట్రంలోని మోనోవై.. ఈ ఊరికి మేయర్ ఉన్నారు.. క్లర్క్, సెక్రటరీ, కోశాధికారి, లైబ్రేరియన్, బార్ టెండర్ ఇలా అందరూ ఉన్నారు.. కానీ ఊర్లో ఉన్నది మాత్రం ఒక్కరే.. అవును.. 2010 అమెరికా జనాభా లెక్కల ప్రకారం ఈ ఊరి జనాభా 1. ఆ ఒక్కరు ఎల్సీ ఐలర్.. వయసు 84. ఇక మేయర్, క్లర్క్, సెక్రటరీ, కోశాధికారి, లైబ్రేరియన్, బార్ టెండర్ గురించి అంటారా.. అవన్నీ కూడా ఎల్సీ ఐలరే!!
ఎందుకలా?
1930ల్లో ఇక్కడ 150 మంది దాకా ఉండేవారు. రెస్టారెంట్లు, షాపులు చివరికి ఓ జైలు కూడా ఉండేది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికాలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కావడంతో జనం వలస బాటన పడ్డారు. ఎల్సీ ఆమె భర్త రూడీ మాత్రం ఇక్కడే ఉన్నారు. కొన్నాళ్ల తర్వాత వీరి పిల్లలు కూడా ఉద్యోగాల నిమిత్తం వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు. 2004లో రూడీ చనిపోయారు. అయినా.. ఎల్సీ ఊరిని విడిచిపోలేదు.. ఊరి మీద ఆమెకున్న మమకారం అలాంటిది. అంతేకాదు.. ఈ ఊరికి ఇన్‌కార్పొరేటెడ్ టౌన్ స్టేటస్ కోసం ఆమె పన్నులు కడతారు. దీనికి కావాల్సిన మున్సిపల్ రోడ్ ప్లాన్‌ను ఏటా సమర్పిస్తారు. ఇన్‌కార్పొరేటెడ్ టౌన్ అంటే ఇక్కడ ప్రభుత్వపరంగా నియమించే అధికారులు ఉంటారు. మేయర్ ఎన్నికలు జరుగుతాయి. ప్రభుత్వ గుర్తింపు ఉంటుంది.
ఎన్నికల్లో ఓటేసేదెవరు?
ఇంకెవరు ఎల్సీనే.. ఊర్లో ఎవరూ లేరు.. దీంతో ఏటా మేయర్ ఎన్నికల్లో నిల్చొని.. తనకు తానే ఓటు వేసుకుంటారు. ఇంకా చిత్రమైన విషయం ఏమిటంటే.. ఏటా బార్, టొబాకో షాపు లైసెన్సు కోసం ఓ బార్ యజమానిగా రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకుంటారు.. ఓసారి దీన్ని పరిశీలించండి అంటూ ఆ అప్లికేషన్ ఊరి సెక్రటరీ దగ్గరకు వస్తుంది.. సెక్రటరీ దరఖాస్తును పరిశీలించి.. అంతా ఓకే అని క్లర్క్ వద్దకు పంపిస్తారు.. క్లర్క్ కూడా ఓకే చేసేసి.. అనుమతి మంజూరు చేస్తూ బార్ యజమానికి ఉత్తర్వుల కాపీ ఇస్తారు.. ఇక్కడ సెక్రటరీ, క్లర్క్, బార్ యజమాని ముగ్గురూ ఎల్సీనే.. అంటే.. తనే దరఖాస్తు పెట్టి.. తనే ఓకే చేసి.. తనే తీసుకుంటారన్నమాట!
మరి.. ఒక్కరే బోర్ కొట్టదా..
కొట్టదు.. ఎందుకంటే.. ఆమె నడుపుతున్న బార్, లైబ్రరీలకు పర్యాటకుల తాకిడి ఉంటుంది. గతంలో ఆ ఊరి నుంచి వెళ్లిపోయిన వాళ్లు తమ రెండో, మూడో తరాన్ని ఇక్కడికి తీసుకొచ్చి.. ఎల్సీని చూపిస్తుం టారు. అమెరికాలో ఒక్కరే ఉంటున్న ఇన్‌కార్పొరేటెడ్ టౌన్‌గా పేరు రావడంతో దీన్ని చూడ్డానికి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారు. పలు చానళ్లు డాక్యుమెంటరీలు కూడా ఇక్కడ తీశాయి. ఎల్సీ మనవలు అక్కడికి 90 మైళ్ల దూరంలోని పోన్కా పట్టణంలో ఉంటారు. వాళ్లు అక్కడికి సమీపంలోనే ఉన్నా.. ఊరిని విడిచి వెళ్లడానికి ఆమె ఇష్టపడటం లేదు.
నేను ఇక్కడే పుట్టాను.. ఇక్కడే పెరిగాను..
ప్రాణం పోయినా ఇక్కడే పోవాలి.. అంతే తప్ప.. ఈ మట్టిని..ఊరిని మాత్రం విడిచిపోను..
– ఎల్సీ ఐలర్
..: సాక్షి, తెలంగాణ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment