స్త్రీలు వికసిస్తున్న కాలంలో... | Story About Violet Season Navel | Sakshi
Sakshi News home page

స్త్రీలు వికసిస్తున్న కాలంలో...

Published Mon, Dec 10 2018 5:56 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

Story About Violet Season Navel - Sakshi

1898. అమెరికా–హడ్సన్‌ వేలీలో ఉన్న కాల్పనిక ఊరైన అండర్వుడ్‌లో, వయొలెట్‌ పూలకి గిరాకీ ఎక్కువ ఉండేది. ఫ్రాంక్‌ ఫ్లెచర్‌ గతంలో చేసిన తప్పుకి తన వారసత్వాన్ని కోల్పోయి, అన్నలిద్దరి వయొలెట్‌ తోటల్లో పనివాడుగా ఉంటాడు. ఇంటి పనులు చేస్తూ, కాయగూరలు పండిస్తూ ఉండే భార్య ఐడా, వారి ముగ్గురు పిల్లలూ కూడా అతనికి సహాయపడతారు. ఆ ఆదాయం ఫ్రాంక్‌కి సరిపోక, ఐడా వద్దకి చుట్టుపక్కల ఊర్లనుండి చిన్న పిల్లల్ని తెస్తూ ఆమెను పాలదాయిని చేస్తాడు.ఫ్రాంక్‌ మితభాషి, ముక్కోపి. ఆ కోపానికి గురయ్యేది భార్యా, కూతురైన ఏలీస్‌. తన కుటుంబం పట్ల ఏ ప్రేమా చూపకుండా, కుటుంబ సభ్యులు తన అధికారాన్ని ప్రశ్నించకూడదనుకునే వ్యక్తి అతను. ‘నన్ను ఫ్రాంక్‌ ప్రేమిస్తున్నాడా! రక్తమాంసాలున్న మనిషినని ఏనాడైనా అనుకున్నాడా? లేకపోతే, కేవలం నన్ను కలుపు తీసే వొక పారగా, తవ్వే బొరిగగా, వంట చేసి పిల్లల్ని కంటూ, తనకి పనికొచ్చే మనిషిగానో, వొక వస్తువుగానో మాత్రమే లెక్కించాడా!’ అని బాధ పడుతుంటుంది ఐడా.

ఫ్రాంక్‌– ఏలీస్‌ చదువు మానిపించి, ఎవరికీ తెలియకుండా న్యూయార్క్‌ తీసుకెళ్తాడు. ‘ఆ తరువాత ఎలాగో వ్యాపారంలోకి దిగుతుంది’ అన్న నమ్మకంతో, వేశ్యాగృహంలో పనమ్మాయిగా కుదురుస్తాడు. కూతురికి ఫాక్టరీలో పని ఇప్పించానని ఐడాకు చెప్తాడు. ఐడాకు కోపం వచ్చి ఏలీస్‌ను ఇంటికి తెద్దామనుకుని కూడా, ‘చేయగలిగేదేముంది! అడగటానికి ఏముంది? ఎవరూ ఏమీ చేయలేరు. ఎవరి మీదా ఆధారపడలేను’ అని దిగులు పడుతుంది– క్యాథీ లెనెర్డ్‌ జెపియల్‌ రాసిన ‘వయొలెట్‌ సీజన్‌’ నవల్లో. అయిదు నెలల తరువాత కూడా ఏలీస్, తన ఉత్తరాలకి జవాబివ్వకపోవడంతో ఐడాకి అనుమానం వేసి, భర్తకు చెప్పకుండా కూతుర్ని వెతకడానికి వెళ్తుంది. కూతురి జాడ తెలిసేటప్పటికే, ఏలీస్‌ బలాత్కారానికి గురై ఉంటుంది. ఏలీస్‌ తల్లిపై విముఖత పెంచుకుంటుంది. భార్య ఊరి బయట కాలు బయటపెట్టడం వల్ల, తను తలెత్తుకుని తిరగలేననుకున్న ఫ్రాంక్, అవమానం భరించలేక ఇల్లొదిలి వెళ్ళిపోతాడు. కుటుంబంలో ఎవరూ కంటతడి పెట్టరు.

ఆ తరువాత ఏలీస్‌ పీటర్‌ను పెళ్ళి చేసుకుని సుఖంగా ఉంటుంది. ఎన్నో ఏళ్ళ తరువాత ఒక ఇంటర్వ్యూలో– ఏలీస్, ఐడా మానసిక బలాన్ని గుర్తించడం తల్లీ కూతుళ్ళ మధ్యనుండే అపార్థాలకి ముగింపునిస్తుంది. వారిద్దరి గొంతుతో వినబడే కథనం– మానవ తాళిమి ఎంతవరకు సాగగలదో చెప్తుంది. తమ కుటుంబాలను, పెళ్ళిళ్ళను కాపాడుకోడానికి స్త్రీలు చేసే త్యాగాల గురించిన ఈ నవల్లో, లైంగిక సంభాషణలూ, కొంత అశ్లీలతా ఉంటాయి. పుస్తకం–తమకున్న హక్కుల, స్వేచ్ఛ గురించి స్త్రీలు అప్పుడప్పుడే తెలుసుకుంటున్న కాలంలో, తల్లీ కూతురి ప్రయాణం గురించినది. ‘పెళ్ళి వ్యభిచారానికి మరొక రూపం, అంతే. ఆర్థిక సహాయానికి ఉన్న ఏకైక మార్గం పురుషులే కనుక ఆడవాళ్ళు పెళ్ళి చేసుకునేవారు’ అంటారు రచయిత్రి.

ఎన్నో చారిత్రక వివరాలున్న కథ, పాత్రల జీవితాల చిన్న వివరాలని కూడా వర్ణిస్తుంది. కుట్టు మెషీన్‌ చప్పుడుని, జబ్బు వాసనని, తాడుమీద ఆరేసి ఉన్న బట్టల అల్లికలను– ఐడా, ఏలీస్‌ గడిపే జీవితాలకి నేపథ్యంగా ఉపయోగిస్తారు రచయిత్రి. భర్తని విడిచిపెట్టడం అసాధ్యం, విడాకులు ఖర్చుతో కూడినవి అయిన కాలంలో, ఫ్రాంక్‌ తన పిల్లల్నీ, పెళ్లాన్నీ తిట్టడం, కొట్టడం సామాన్యమే అయినా, రచయిత్రి వివరించిన విధానం వల్ల, పాత్రల పట్ల సానుభూతి కలుగుతుంది. సైమన్‌ – షుస్టర్, 2012లో ప్రచురించిన ఈ నవల్లో, వయొలెట్ల సాగుబడి వివరాలుంటాయి. ఇతరుల దయమీద బతికే స్త్రీల జీవితాలకు సున్నితమైన ఆ పూలు పరిపూర్ణమైన ప్రతిరూపాలు. కృష్ణ వేణి

క్యాథీ లెనెర్డ్‌ జెపియల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement