
పేదరిక రహిత ప్రపంచం మనందరి కల కావాలి: మోదీ
పేదరిక రహిత ప్రపంచం మనందరి కల కావాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు నిచ్చారు
న్యూయార్క్: పేదరిక రహిత ప్రపంచం మనందరి కల కావాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు నిచ్చారు. ఐర్లాండ్ నుంచి ఐదురోజుల పర్యటనలో భాగంగా అమెరికా వెళ్లిన ఆయన శుక్రవారం న్యూయార్క్ లోని ఐరాస సర్వప్రతినిధి సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుస్థిర అభివృద్ధి, ఉగ్రవాదం, వాతావరణ మార్పులపై మోదీ మాట్లాడారు. వాతావరణ మార్పులపై ఉమ్మడి ఒప్పందం ఆవశ్యకతపై ఆయన వివరణ ఇచ్చారు.
ప్రపంచంలో 1.3 బిలియన్లు(నూటముఫ్ఫై కోట్లు) మంది పేదరికంలో ఉన్నారని చెప్పారు. పేదరికం నుంచి బయటపడాల్సిన అవసరం ఎంతో ఉందని హితవు పలికారు. 2030 నాటికి అభివృద్ధి అజెండా పూర్తి చేసుకోవాలని మోదీ సూచించారు.
ఐరాస సభలో మోదీ ప్రస్తావించిన మరికొన్ని కీలక అంశాలు..
⇒ విద్య, నైపుణ్యాభివృద్ధికే మా ప్రాధాన్యత
⇒ పేదరిక నిర్మూలనే మా ప్రధాన బాధ్యత
⇒ మహిళ సాధికారిత సాధించడమే మా లక్ష్యం
⇒ సుస్థిర అభివృద్ధితోనే వాతావరణ మార్పుల సవాల్ను ఎదుర్కోగలం