పాలుతాగే పసివాడిపై హత్య కేసు కొట్టేసిన పాక్ కోర్టు
తొమ్మది నెలల పాలుతాగే పసిబాలుడిపై హత్య చేసినట్టు కేసు మోపిన పోలీసులకు పాకిస్తానీ కోర్టు మొట్టికాయలు వేసింది. మూసాఖాన్ అనే ఈ తొమ్మిది నెలల పసిగుడ్డు పాలసీసా నోట్లో పెట్టుకుని తాతయ్య ఒళ్లో కూర్చుని కోర్టుకు హాజరయ్యారు.
లాహోర్ లో ఒక కుటుంబం పోలీసును చితకబాదింది. ఆ పోలీసు మొత్తం కుటుంబంపై హత్యా యత్నం కేసు నమోదు చేశాడు. దీంతో ఆ కుటుంబంలోని పసిపాప మూసాఖాన్ పైనా హత్యా యత్నం కేసు నమోదైంది. ఈ పసిబాలుడికి కొద్ది రోజుల క్రితమే బెయిల్ కూడా లభించింది. అంతకుముందు పోలీసులు ఆ పసిగుడ్డు వేలిముద్రలు సేకరించేందుకు ప్రతయ్నం చేస్తే ఆ పిల్లవాడు పేచీ పెట్టేశాడు.
చివరికి శనివారం ఈ కేసు మళ్లీ విచారణకు వచ్చింది. న్యాయమూర్తి బాలుడిపై హత్యాయత్నం కేసును కొట్టేశారు. మిగతా కుటుంబసభ్యులపై కేసును మాత్రం అలాగే ఉంచారు.