
ప్రధాని పదవి నుంచి దిగిపో.. లేదా..!
లాహోర్: ఏడు రోజుల్లో ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయకపోతే విపత్కర పరిస్ధితి ఎదుర్కొవాల్సి ఉంటుందని ఆ దేశ సుప్రీం కోర్టు, లాహోర్ హైకోర్టు బార్ అసోసియేషన్లు పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌ను హెచ్చరించాయి. షరీఫ్ రాజీనామా చేయకపోతే ఆయనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ప్రారంభిస్తామని పేర్కొన్నాయి. ఈ మేరకు సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి. పనామా పేపర్ల కేసులో సుప్రీం కోర్టు తీర్పు తర్వాత షరీఫ్ ప్రధాని పదవిలో ఉండే అర్హత కోల్పోయారని అన్నాయి.
ఈ నెల 19వ తేదీన పాకిస్తాన్ లాయర్స్ రిప్రజెంటేటివ్స్ కన్వెన్షన్ వద్ద పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్(పీఎంఎల్‌ఎన్) తరఫు న్యాయవాదులు ఎస్‌సీబీఏ, ఎల్‌హెచ్‌సీబీఏ సభ్యులతో గొడవపడిన విషయం తెలిసిందే. ఈ సంఘటనను తీవ్రంగా పరిగణించిన బార్ అసోసియేషన్లు నవాజ్ షరీఫ్ ప్రధాని పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నెల 27 తేదీలోపు షరీఫ్ ప్రధాని పదవి నుంచి తప్పుకోకపోతే ఆయనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామని ప్రకటించాయి.