'వీల్ చైర్లో ఉన్న నేరస్తుడిని ఎలా ఉరి తీయాలి'
ఇస్లామాబాద్: పాకిస్థాన్ తొలిసారి ఓ ఉరిశిక్షను అమలు చేయకుండా వాయిదా వేసింది. ముందుగా నిర్ణయించిన సమయంలో ఉరి తీసే కార్యక్రమాన్ని నిలిపివేయడం ఆ దేశ చరిత్రలోనే ఇదే తొలిసారి కావడం కూడా గమనార్హం. ఓ హత్య కేసు విషయంలో అబ్దుల్ బాసిత్ (43) అనే వ్యక్తిని పాకిస్థాన్ పోలీసులు గతంలో అరెస్టు చేసి కోర్టులో ప్రవేశ పెట్టగా సుదీర్ఘ విచారణ చేపట్టిన కోర్టు చివరకు ఉరిశిక్ష విధించింది. కోర్టు విధించిన శిక్ష ప్రకారం అతడిని పంజాబ్లోని ఫైసలాబాద్ జైలులో మంగళవారం ఉదయమే ఉరితీయాలి. కానీ, అతడి విషయంలో గత కొంతకాలంగా హక్కుల సంఘంవారు పలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
ఎందుకంటే ఆ నేరస్థుడు ఒక వికలాంగుడు. ప్రస్తుతం అతడు చక్రాల కుర్చీ మీద ఉండే జైలు శిక్షను అనుభవిస్తున్నాడు. స్థానిక చట్టాల ప్రకారం ఓ వ్యక్తిని ఉరితీసేముందు అతడు ఉరికంభం వద్ద నిల్చుని ఉన్నప్పుడే తలారీ అతడి మెడకు ఉరితాడు బిగించాలి. కానీ బాసిత్ వికలాంగుడు కావడం వల్ల నిల్చునే అవకాశం లేదు. దీనిపై ఇప్పటికే జైలు అధికారులు పంజాబ్ హోంశాఖను అభిప్రాయం కోరినా ఉరిశిక్ష అమలు తేదీ వరకు కూడా వారు ఓ నిర్ణయం ప్రకటించకపోవడంతో ఉరి శిక్షను తాత్కాలికంగా నిలిపివేసి తలలు పట్టుకున్నారు. 2009లో బాసిత్ ఓ ఆస్తి వివాదానికి సంబంధించి ఓ వ్యక్తిని హత్య చేశాడు. అనంతరం టీబీ కారణంగా పక్షవాతానికి గురయ్యాడు. పక్షవాతంతోనే అతడు వీల్ చైర్లో ఉండి జైలు శిక్షను అనుభవిస్తున్నాడు.