ఉగ్ర చర్యలపై పొగడ్తలా..?
ఐరాసలో పాక్ తీరుపై భారత్ మండిపాటు
* బుర్హాన్, కశ్మీర్ అంశాల్ని లేవనెత్తడంపై అభ్యంతరం
* చర్చలే మా అభిమతం: అమెరికా
ఐక్యరాజ్యసమితి/న్యూఢిల్లీ/వాషింగ్టన్/ఇస్లామాబాద్: ఐక్యరాజ్యసమితిలో హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వనీ మృతిని, కశ్మీర్ అంశాన్ని పాకిస్తాన్ లేవనెత్తడంపై భారత్ శుక్రవారం తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేసింది. ఉగ్రవాదులు చేస్తున్న పనుల్ని పొగడటంతో పాటు, ఇతరుల భూభాగాల్ని పాకిస్తాన్ ఆశిస్తోందంటూ ఐరాసలో భారత రాయబారి సయద్ అక్బరుద్దీన్ ఒక ప్రకటనలో గట్టిగా సమాధానమిచ్చారు.
బుధవారం ఐరాసలో మానవ హక్కులపై చర్చ సందర్భంగా పాక్ ప్రతినిధి మలీహా లోధీ కశ్మీర్ అంశంతో పాటు, బుర్హాన్ మృతిపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. కశ్మీర్ అంశంతో పాటు, బుర్హాన్‌ను భారత్ దళాలు అన్యాయంగా హత్య చేశాయంటూ లోధీ పేర్కొన్నారు. కశ్మీర్‌లో భారత దళాలు మానవహక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయనేందుకు బుర్హాన్ మృతి భీతిగొల్పే తాజా ఉదాహరణగా ఆమె పేర్కొన్నారు.
దీనిపై అక్బరుద్దీన్ స్పందిస్తూ... పాకిస్తాన్ ఇతరుల భూభాగాన్ని దురాశపూరితంగా ఆశిస్తోందని, అందుకోసం ఉగ్రవాదాన్ని జాతీయ విధానంగా వాడడానికి పాకిస్తాన్ స్వస్తి పలకాలన్నారు. ఐరాస జాబితాలోని ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్న పాకిస్తాన్ మానవ హక్కులు, స్వయం పాలనకు మద్దతుగా మాట్లాడడంపై విస్మయం వ్యక్తం చేశారు.
చర్చలకు ఆహ్వానం: బాన్ కీ మూన్
బుర్హాన్ మృతితో చెలరేగిన ఆందోళనల నేపథ్యంలో అన్ని వర్గాలు నిగ్రహం పాటించాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ బాన్ కీ మూన్ పేర్కొన్నారు. భారత్, పాక్ మధ్య ప్రత్యక్ష చర్చల్ని ఎల్లప్పుడూ ఆహ్వానిస్తానని అన్నారు. కశ్మీర్ అంశం పరిష్కారానికి భారత్, పాకిస్తాన్‌ల మధ్య చర్చలు కొనసాగాలని అమెరికా కోరుకుంటుందని ఆ దేశ స్టేట్ డిపార్ట్‌మెంట్ డిప్యూటీ ప్రతినిధి మార్క్ టోనర్ చెప్పారు.
సంబంధాలు తెంచుకోండి: సయీద్
భారత్ పాలిత కశ్మీర్‌లో హింస పెరుగుతోందని లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ హెచ్చరించారు. కశ్మీర్ వివాదంలో అమెరికాను ఒప్పించకపోతే ఆ దేశంతో సంబంధాలను తెగదెంపులు చేసుకోవాలంటూ దేశ వ్యాప్త ప్రచారం నిర్వహిస్తామని చెప్పారు. మరోవైపు కశ్మీర్ ప్రజలకు సంఘీభావంగా శుక్రవారం ర్యాలీలు నిర్వహిస్తామంటూ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్ బిలావల్ భుట్టో వేర్పాటువాద నేత మిర్వాయిజ్ ఫరూక్‌కు ఫోన్‌లో చెప్పారు.