కర్ణాటక ఎన్నికలు.. పాక్‌ కుట్ర! | Pakistan Tippu Sultan Tweets Effect on Karnataka Polls | Sakshi
Sakshi News home page

Published Sun, May 6 2018 10:07 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

Pakistan Tippu Sultan Tweets Effect on Karnataka Polls - Sakshi

సాక్షి, బెంగళూరు: కర్ణాటక ఎన్నికలను ప్రభావితం చేసేందుకు పాకిస్థాన్‌ రంగంలోకి దిగిందనే అనుమానాలను బీజేపీ వ్యక్తం చేస్తోంది. టిప్పు సుల్తాన్‌ 218 వర్ధంతి సందర్భంగా పాక్‌ గవర్నమెంట్‌ అఫీషియల్‌ ట్వీటర్‌ అకౌంట్‌లో శుక్రవారం రెండు పోస్టులు వెలిశాయి. టిప్పు అరివీర భయంకరుడని పేర్కొంటూ పాక్‌ వాటిల్లో ప్రశంసలు గుప్పించింది. దీంతో కుట్రకు తెరలేచిందని బీజేపీ ఆరోపిస్తోంది.

‘టిప్పు సుల్తాన్‌ అంతులేని జ్ఞాన సంపద ఉన్న వ్యక్తి. పులినే తన అధికర చిహ్నంగా చేసుకున్న ధైర్యశాలి. మైసూర్‌ టైగర్‌. బ్రిటీష్‌ సైన్యం ఎదుర్కొన్న అతి గొప్ప శత్రు సారధుల్లో ఆయన ఒకరు. మైనార్టీలను టిప్పు దయతో చూసేవారు. ఫ్రెంచ్‌ వారికి చర్చి నిర్మించుకునేందుకు అనుమతి ఇచ్చారు. నక్కలాగా వందేళ్లు బతకటం కంటే.. సింహంలా ఒక్కరోజు బతికినా చాలని చాటిచెప్పిన వ్యక్తి. బ్రిటీష్‌ సామ్రాజ్య విస్తరణను అడ్డుకునేందుకు సంధించబడ్డ చివరి బాణం’ అంటూ ప్రశంసలు గుప్పించింది. ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని కూడా ట్వీటర్‌ ఖాతాలో పోస్టు చేసింది.

ఇది కుట్రే: బీజేపీ.. అయితే ఈ వ్యవహారంపై బీజేపీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. కర్ణాటక ఎన్నికలను ప్రభావితం చేసేందుకు పాక్‌ కుట్ర పన్నుతోందని ఆరోపిస్తోంది. ‘1947 ఆగష్టు 14 నుంచి తమ చరిత్ర మొదలైనట్లు పాకిస్థాన్‌ చెప్పుకుంటుంది. అలాంటిది ఉన్న పళంగా ఇంత ప్రేమ కురిపించటం ఏంటి? అన్నింటికి మించి భారతీయ చారిత్రక వారసత్వాన్ని పాక్‌ ఏనాడూ గుర్తు చేసుకోలేదు. కర్ణాటక ముస్లిం ఓటర్లను ప్రభావితం ఈ పని చేసిందనిపిస్తోంది’ అని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు చెబుతున్నారు. 

కాగా, టిప్పు జయంతి ఉత్సవాల విషయంలో కాంగ్రెస్‌ పార్టీ-బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగిన విషయం తెలిసిందే. అయినప్పటికీ సిద్ధరామయ్య ప్రభుత్వం ఘనంగా వేడుకలను నిర్వహించింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement