
సియోల్ : ఉత్తర కొరియా నిరంతరంగా అణ్వస్త్ర క్షిపణి ప్రయోగాలను నిర్వహిస్తుండడం, వాటిని అమెరికా, దాని మిత్ర దేశాలపై ప్రయోగిస్తామంటూ తరచు బెదిరిస్తుండడంతో భయపడి పోయిన దక్షిణ కొరియా ప్రజలు అణ్వస్త్ర రక్షణ బంకర్ల కోసం పరుగులు తీస్తున్నారు. ప్రజల భయాన్ని, వారి అవసరాన్ని గుర్తించిన చుందన్ బంకర్ సిస్టమ్ సంస్థ వీటిని తయారు చేస్తోంది. వీటి ప్రదర్శన కోసం సియోల్‌లో ఓ షోరూమ్‌ను కూడా ఏర్పాటు చేసింది. అణ్వస్త్రాల దాడి నుంచి వెలువడే విష వాయువులు, కురిసే ఆమ్ల వర్షాల నుంచి రక్షించే సదుపాయాలు కూడా ఈ బంకర్లలో ఉన్నాయి. ఇందులో ప్రాథమికంగా నాలుగు బెడ్లు ఉన్నాయి. అవసరార్థం వీటిని ఎనిమిది బెడ్లుగా మార్చుకోవచ్చు. ఎనిమిది మంది నెల రోజుల పాటు ఇందులో సౌకర్యంగా ఉండేందుకు అవసరమైన ఫిల్టర్ గాలి, ఆహార పదార్థాలు నిల్వ చేసుకునే స్థలంతోపాటు ఓ ఫ్రిడ్జ్, కంప్యూటర్‌లు ఉన్నాయని కంపెనీ యజమాని గో వాన్ హైయోక్ తెలిపారు. విద్యుత్ ఉత్పత్తి చేసే సోలార్ ప్యానళ్లను ఏర్పాటు చేశామని, అయినప్పటికీ అత్యయిక పరిస్థితుల్లో నెల రోజులపాటు విద్యుత్‌ను ఉత్పత్తిచేసే జనరేటర్లు కూడా అమర్చారని తెలిపారు.
అణ్వస్త్ర దాడి అనంతరం బయట సాధారణ పరిస్థితులు నెలకొన్నాయా, లేదా? అన్న విషయాన్ని తెలుసుకునేందుకు పెరిస్కోప్ కూడా ఉందన్నారు. మరుగుదొడ్డి లాంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు విష వాయువులు, ఆమ్ల వర్షాల నుంచి రక్షించే మాస్క్‌లు, గ్లౌస్‌లు, ఫ్యామిలీ గౌన్ల కూడా బంకర్లలో అందుబాటులో ఉంచామని చెప్పారు. ఈ బంకర్లను ఇంటి ఆవరణలో భూ ఉపరితలం కింద ఏర్పాటు చేసుకొనే వెసలు బాటు ఉంది. అత్యయిక పరిస్థితుల్లో అందులోకి వెళ్లేందుకు భూ ఉపరితలం నుంచి మార్గాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇన్ని సౌకర్యాలున్న ఈ బంకరు ధరను 20 లక్షల రూపాయలుగా నిర్ణయించారు. ప్రజలు వీటిని కొనేందుకు ఎగబడుతున్నారని, ప్రస్తుతం వారి డిమాండ్‌ను అందుకోలేక పోతున్నామని గో వాన్ తెలిపారు. దేశీయ అవసరాలు తీరాక, యూరప్, బ్రిటన్ మార్కెట్‌లోకి కూడా అడుగు పెడతామని ఆయన చెప్పారు. ప్రపంచంలో ప్రజలు ఉపయోగించే అణ్వస్త్ర రక్షణ బంకర్లను తయారు చేయడం ఇదే మొదటిసారని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment