జనక్‌పూర్- అయోధ్యల మధ్య బస్సు సర్వీసు ప్రారంభిస్తున్న మోదీ- కేపీ శర్మ ఓలి
జనక్‌పూర్, నేపాల్ : కర్ణాటక ఎన్నికల ప్రచారం ముగియగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన నిమిత్తం నేపాల్ వెళ్లారు. రెండు రోజుల నేపాల్ పర్యటనలో ఆయన అక్కడి మూడు హిందూ తీర్థాలయాలను సందర్శించనున్నారు. కాగా భారత ప్రధాని హోదాలో మోదీ నేపాల్ పర్యటనకు వెళ్లడం ఇది మూడోసారి.
రామాయణ్ సర్క్యూట్ ప్రారంభం..
నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీతో కలిసి మోదీ జెండా ఊపి నేపాల్- ఉత్తరప్రదేశ్‌ల మధ్య బస్సు సర్వీసును ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఎన్నో శతాబ్దాలుగా జనక్‌పూర్-అయోధ్యల మధ్య సత్సంబంధాలు ఉన్నాయని, ఈ బస్సు సర్వీసు ద్వారా ఆ బంధం మరింత బలపడనుందని వ్యాఖ్యానించారు. నేపాల్- భారత్‌ల మధ్య మతపరమైన పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ సర్వీసును ప్రారంభించినట్టు సమాచారం.
రామాయణ్ సర్క్యూట్ థీమ్‌లో భాగంగా భారత్‌లోని అయోధ్య, నందిగాం, హంపి, నాగ్‌పూర్‌తో సహా 15 ప్రదేశాలను సందర్శించే అవకాశం కల్పించనున్నారు.నేపాల్ రాజధాని ఖట్మాండూ నుంచి 225 కిలోమీటర్ల దూరంలో ఉన్న జనక్‌పూర్ సీతమ్మ వారి జన్మస్థానంగా ప్రసిద్ధికెక్కింది. కాగా అక్కడి నుంచి ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య(రామ జన్మభూమిగా ప్రసిద్ధి) వరకు రామాయణ్ సర్క్యూట్ పేరిట బస్సు సేవలు అందుబాటులోకి రానున్నాయి.
నేపాల్ లేకుండా భారత చరిత్ర అసంపూర్ణం..
బస్సు సర్వీసు ప్రారంభించిన అనంతరం మోదీ మాట్లాడుతూ పొరుగు దేశం నేపాల్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. నేపాల్ లేకుండా భారత్ విశ్వాసం, చరిత్ర అసంపూర్ణమంటూ వ్యాఖ్యానించారు. నేపాల్ లేనిదే భారత ఆలయాలు, మా రాముడు కూడా అసంపూర్ణమేనంటూ మోదీ పేర్కొన్నారు. తన పర్యటన ఇరు దేశాల మధ్య ఉన్న బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందంటూ వ్యాఖ్యానించారు.
మోదీ నేపాల్ పర్యటన విశేషాలు...
1. మోదీ పర్యటన సందర్భంగా.. ఇరుదేశాలకు చెందిన సుమారు 11 వేల మంది భద్రతా సిబ్బంది తమ సేవల్ని అందిస్తున్నారు.
2. నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలితో మోదీ శుక్రవారం భేటీ కానున్నారు. అనంతరం నేపాల్ అధ్యక్షుడు, ఇతర ప్రధాన రాజకీయ పార్టీల నాయకులతో సమావేశమై చర్చలు జరపనున్నారు. తర్వాత ప్రఖ్యాత పశుపతినాథ్ ఆలయాన్ని సందర్శించనున్నారు.
3. శనివారం రోజున థరంగ్ లా కొండ పాదాల చెంతనున్న ముక్తినాథ్ ఆలయంలో ప్రార్థనలు చేసిన అనంతరం.. ఆ ఆలయ అభివృద్దికి భారత్ అందించనున్న సాయంపై ప్రకటన చేసే అవకాశం ఉంది.
4. తూర్పు నేపాల్‌లోని శంకువసభ జిల్లాలో జలవిద్యుత్ ప్రాజెక్టుకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టును భారత ప్రభుత్వానికి చెందిన సట్లేజ్ జల్ విద్యుత్ నిగమ్ నిర్మించనుంది.
Comments
Please login to add a commentAdd a comment