ప్రధాని నరేంద్ర మోదీ
న్యూయార్క్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమాల్లో దూసుకుపోతున్నారు. ప్రధానంగా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌లో ప్రధాని ఫాలోయింగ్ రికార్డులు సృష్టిస్తోంది. ఫేస్‌బుక్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను వెనక్కు నెట్టి మోదీ ముందువరుసలో నిలిచారు. బీసీడబ్ల్యూ గురువారం విడుదల చేసిన నివేదిక ప్రకారం మోదీ వ్యక్తిగత అకౌంట్‌కు ఇప్పటివరకు 43.5 మిలియన్ లైకులు వచ్చాయి. అధికారిక అకౌంట్‌కు 13.7 మిలియన్ల లైకులు వచ్చాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 23 మిలియన్ లైకులతో రెండో స్థానంలో నిలవగా, జోర్డాన్ క్వీన్ రాణియా 16.9 మిలియన్ లైకులతో మూడో స్థానంలో ఉన్నారు. బ్రెజిల్ నూతన అధ్యక్షుడు జెయిర్ బొల్సొనారో ప్రపంచంలోనే విశేషాదరణ పొందుతున్న యువనాయకుడిగా పేరు దక్కించుకున్నారు.
దీని గురించి బీసీడబ్లూ అధికారి చాడ్ లాట్జ్ మాట్లాడుతూ.. ‘జనాలను తమవైపు ఆకర్షించుకోవడానికి నాయకులు ఫేస్‌బుక్‌ను సులువైన సాధనంగా వినియోగించుకుంటున్నారు. ప్రజలతో మమేకమవడానికి, వారి భావాలను పంచుకోడానికి ఫేస్‌బుక్-లైవ్ నుంచి ఫేస్‌బుక్-స్టోరీస్ వరకు అన్నింటినీ విజయవంతంగా ఉపయోగించుకుంటున్నారు’ అని తెలిపారు. ట్రంప్ తన ఫేస్‌బుక్ ఖాతాను తెరిచినప్పటి నుంచీ ఇప్పటివరకు 50 వేల ప్రకటనలను పోస్ట్ చేశారు. బ్రిటన్ ప్రధాని థెరిసా మే బ్రెగ్జిట్ ప్రణాళికను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడానికి, గత సంవత్సరం డిసెంబర్‌లో 74 పెయిడ్ యాడ్స్‌ను పోస్ట్ చేశారు. కామెంట్లు, లైకులు, షేర్స్‌తో కలిపి ప్రపంచ నేతల్ని ఫాలో అవుతున్న వారి సంఖ్య 10 శాతం పెరిగింది. ఇప్పటివరకు అధికంగా 2.5 మిలియన్ల ఫ్యాన్సుని సాధించుకున్న జెర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ఫిబ్రవరిలో అకస్మాత్తుగా తన ఫేస్‌బుక్ పేజ్‌ని డిలీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment