ట్రంప్, పుతిన్ల బ్రొమాన్స్!
విల్నీయస్: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా అధ్యక్ష పదవికి రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్లకు సంబంధించిన ఓ పేయింటింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఇరువురు ప్రముఖ నేతల గాఢ చుంబనాన్ని చూపిస్తున్న ఈ గ్రాఫిటీ పెయింటింగ్ను లిథువేనియా వీధుల్లో స్థానిక కళాకారుడు మిండాగస్ బొనాను వేసాడు. బార్బెక్యూ రెస్టారెంట్ సహ యజమాని డొమినికాస్తో కలిసి ఇటీవల ఆవిష్కరించిన ఈ పెయింటింగ్ ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది.
తూర్పు జర్మనీ కమ్యూనిస్టు నాయకుడు ఎరిక్ హోనెక్కర్, సోవియట్ లీడర్ లియోనార్డ్ బ్రెజ్నెవ్కు సంబంధించిన ఓ ఫోటో గ్రాఫ్ ఆధారంగా.. 1990లో బెర్లిన్ గోడపై గ్రాఫిటీ కళాకారుడు దిమిత్రీ రూబెల్ వేసిన పెయింటింగ్తో ఈ చిత్రానికి పోలికలున్నాయి. అయితే 'మేక్ ఎవ్రిథింగ్ గ్రేట్ ఎగైన్' అంటూ క్యాప్షన్ను కూడా జోడించిన పుతిన్, ట్రంప్ ల చిత్రంపై నెటీజనులు పలురకాలుగా స్పందిస్తున్నారు. గతంలో పలు సందర్భాల్లో ట్రంప్, పుతిన్ ఒకరినొకరు అభినందించుకున్న విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు. దీనిపై డొమినికస్ మీడియాతో మాట్లాడుతూ.. ఇద్దరు నేతల మధ్య సారూప్యతల ఫలితంగా వచ్చిన ఆలోచన ఇదని తెలిపాడు.