పిల్స్ వేసుకున్నా 100మందికి గర్భం వచ్చిందని..
న్యూయార్క్: గర్భ నిరోధక మాత్రలు వేసుకున్నా తాము గర్భం దాల్చడంపట్ల ఆ మాత్రలు తయారుచేసిన ఫార్మాసూటికల్స్ కంపెనీలపై కొందరు మహిళలు కేసులు వేశారు. తమకు భారీ మొత్తంలో నష్టపరిహారం చెల్లించాలంటూ నోటీసులు పంపించారు. అమెరికాలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన మహిళలు ఆ కంపెనీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిలడెల్ఫియాలోని కొందరు మహిళలు తమకు గర్భం దాల్చడం ఇష్టం లేక గర్భ నిరోధక మాత్రలు వేసుకున్నారు.
అయినా, అవి పనిచేయకపోవడంతో వారు గర్భం దాల్చాల్సి వచ్చింది. ఇలా దాదాపు 100మంది మహిళలు తమకు ఇష్టం లేకపోయినా త్వరలో తల్లులుకాబోతున్నారు. అయితే, కొన్ని కంపెనీలు నిర్లక్ష్యంగా తయారుచేసిన మందుల కారణంగానే తమకు ఈ పరిస్థితి వచ్చిందంటూ ఫిలడెల్ఫియాలోని మొత్తం నాలుగు కంపెనీలపై కేసులు పెట్టారు. తమకు భారీ మొత్తంలో నష్టపరిహారం చెల్లించాలని, తమ పిల్లలకు 18 ఏళ్లు వచ్చేవరకు ఆయా రూపాల్లో (విద్య, వైద్యం, పెరుగుదల, నిర్వహణ) అయ్యే ఖర్చును భరించాలని పేర్కొంటూ కోర్టు ద్వారా నోటీసులు పంపించారు.