
టొమాటోలు విసిరి హీరో అయ్యారు!
వాషింగ్టన్: అమ్మాయిలంటే తనకు అస్సలు పడదంటూ, అలవోకగా బండబూతులు మాట్లాడుతూ సోషల్ మీడియాలో ఇంతకాలం హల్‌చల్ చేస్తూ వచ్చిన రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా దేశాధ్యక్ష అభ్యర్థిగా ముందు వరుసలో కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ అదే మీడియా ముందు డంగయ్యారు. మొన్న ఐయోవాలో జరిగిన సభలో డొనాల్డ్‌పై రెండంటే రెండే టమోటాలు విసిరిన 28 ఏళ్ల అనామిక యువకుడు ఆండ్రీవ్ అలెమావో సోషల్ మీడియాలో హఠాత్తుగా హీరో అయ్యారు.
ఎంతోమంది యూజర్లు ఆయన్ని పసందైన విందుతో సత్కరిస్తామంటూ ఆహ్వానాలు పంపించారు. ‘మీరు విసిరిందీ రెండే టొమాటోలైనా చికెన్ టిక్కా, చేపల వేపుడు, ఎగ్ రోల్స్, వెన్న ముద్దలతో పార్టీ ఇస్తాం.....మేమిచ్చే పార్టీలో అదనపు ఆకర్షణ అందమైన అమ్మాయి’ అంటూ మరికొందరు ఎవరికి తోచిన రీతిలో వారు స్పందించారు. మరికొందరు ఆండ్రీవ్‌ను అమెరికా హీరో అంటూ సూపర్ మేన్ గెటప్‌లో చిత్రీకరించారు. నచ్చనివారిపై టమోటాలు విసరే ఆనవాయతీ ఇప్పటికీ ఉందా అంటూ కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
‘మంచికి చెడుకు మధ్యన సన్నటి తెర’ అనే వ్యాఖ్యానంతో మంచివైపు ఆండ్రీవ్, చెడువైపు డొనాల్డ్ సగం ముఖాలున్నట్టు మార్ఫింగ్ ఫొటోలను విడుదల చేశారు. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామా మెచ్చి తమను మెడల్‌తో సత్కరించినా సత్కరించవచ్చంటూ వ్యంగ్య వ్యాఖ్యలు కూడా చేశారు. డొనాల్డ్ ట్రంప్‌పై ఎన్నికల ప్రచార సభలో ఆయనపై టొమాటాలను విసిరిన ఆండ్రీవ్‌ను అమెరికా పోలీసులు అరెస్టు చేసి ‘దుష్ర్పవర్తన’ నేరం కింద కేసు బుక్‌చేసి వదిలేశారు. ఈ నేరం కింద అమెరికాలో స్పల్ప జరిమానా లేదా స్వల్ప జరిమానాతోపాటు స్పల్ప శిక్షను స్థానిక కోర్టు విధించే అవకాశం ఉంటుంది.