రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం ఆశిస్తున్న డోనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం ఆశిస్తున్న డోనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈసారి మహిళలను లక్ష్యంగా చేసుకుని ట్రంప్ విమర్శలకు దిగారు. అక్రమంగా అబార్షన్లు చేయించుకునే మహిళలను శిక్షించాలని పిలుపునిచ్చారు. బుధవారం ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. అబార్షన్లు చేయించుకునే మహిళలకు ఏదో ఒక శిక్ష విధించాలని చెప్పారు. ట్రంప్ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు, మహిళా సంఘాలు విరుచుకుపడ్డాయి.
డెమొక్రాటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం ఆశిస్తున్న హిల్లరీ క్లింటన్, బెర్నీ శాండర్స్ దీనిపై స్పందిస్తూ.. ట్రంప్ మాటలు చాలా ఘోరమైనవని, ఇటువంటి వ్యాఖ్యలు చేసినందుకు ఆయన సిగ్గుపడాలని పేర్కొన్నారు. కీలకమైన అంశాలపై తాను ఎక్కువగా ఆలోచించకుండా మాట్లాడతానని ట్రంప్ నిరూపించుకున్నారని రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యర్థిత్వం ఆశిస్తున్న టెడ్ క్రూజ్ ఆరోపించారు. తన వ్యాఖ్యలపై విమర్శలు చెలరేగడంతో ట్రంప్ వెంటనే వివరణ ఇచ్చారు. అక్రమంగా అబార్షన్లు చేసిన డాక్టర్లు బాధ్యులని, మహిళలు కాదని స్పష్టం చేశారు.