
ఒబామాపై విరుచుకుపడ్డ ట్రంప్
రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా అమెరికా అధ్యక్ష రేసులో నిలిచిన డోనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీవీ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ట్రంప్ తనదైనశైలిలో రెచ్చిపోయారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కంటే కూడా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గొప్ప నాయకుడని ప్రశంసల వర్షం కురిపించారు. ఓవైపు ఒబామా విధానాలను, నాయకత్వాన్ని డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ తన ప్రచార అస్త్రంగా వాడుకుంటుండగా.. వీరిద్దరి నాయకత్వంలో అమెరికా దిగజారడం ఖాయమని ట్రంప్ విమర్శించారు.
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థను ఎదుర్కోవాలంటే అమెరికాకు రష్యా తోడవ్వాలని పిలుపునిచ్చారు. రెండు దేశాల మధ్య ధ్వైపాక్షిక సంబంధాలు, ఇతర ఒప్పందాలు మెరుగు పడతాయని ట్రంప్ అభిప్రాయపడ్డారు. నిపుణుల సలహాలను ఒబామా ఎప్పుడూ అమలు చేసే వారు కాదని ఆయన విధానాలను తప్పుపట్టారు. అమెరికా మిలిటరీ మరింత పటిష్టం కావాలని లేకపోతే ఇస్లామిక్ ఉగ్రసంస్థలతో పాటు ఉత్తర కొరియా, చైనా దేశాల నుంచి దేశానికి ముప్పు తప్పదని హెచ్చరించారు.