మాస్కో: అమెరికా, రష్యాల మధ్య ఉద్రిక్తతలు పెంచే దిశగా అగ్రరాజ్యం విడుదల చేసిన ‘పుతిన్ లిస్టు’ ప్రకంపనల్ని రేపుతోంది. తమ అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకున్నారని ఆరోపిస్తూ రష్యాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల పేర్లతో ఈ జాబితాను అమెరికా విడుదల చేసింది. అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకున్నందుకు రష్యాను శిక్షించాలని అమెరికన్ కాంగ్రెస్ చేసిన చట్టం అమల్లో భాగంగా సోమవారం అర్ధరాత్రి దాటాక అమెరికా ఆర్థిక శాఖ ఈ జాబితాను విడుదల చేసింది.
రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ వెబ్‌సైట్‌లో పేర్కొన్న పుతిన్ పరిపాలన యంత్రాంగంలోని అందరి పేర్లతో పాటు కేబినెట్ మంత్రుల్ని, ఆ దేశానికి చెందిన ప్రముఖ బిలియనీర్లను ఇందులో చేర్చింది. జాబితాలోని 114 మంది రాజకీయ నాయకుల్లో పుతిన్ సహాయకులు, కేబినెట్ మంత్రుల పేర్లు ఉండగా.. 96 మంది బిలియనీర్లలో వివాదరహితులుగా పేరొందిన పలువురు వ్యాపారవేత్తలు కూడా ఉండటం గమనార్హం.
రష్యా ప్రధాని దిమిత్రి మెద్వెదెవ్, విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్, నిఘా విభాగాలైన ఎఫ్‌ఎస్‌బీ, జీఆర్‌యూలకు చెందిన ఉన్నతాధికారులు కూడా ఇందులో ఉన్నారు. ఇక బిలియనీర్లలో ప్రముఖ ఆయిల్ వ్యాపారి, చెల్సియా ఫుట్‌బాల్ క్లబ్ యజమాని రోమన్ అబ్రమోవిక్, అల్యూమినియం వ్యాపారి ఓలెగ్ డెరిపస్క, 2012 అధ్యక్ష ఎన్నికల్లో పుతిన్‌పై పోటీచేసిన మిఖాయిల్ ప్రొఖొరొవ్‌తో పాటు వివాద రహితులుగా పేరున్న ప్రముఖ సెర్చ్ ఇంజిన్ యాండెక్స్ వ్యవస్థాపకుడు అర్కడి వోలొజ్ తదితరులున్నారు.
నా పేరు లేదే..!: పుతిన్
పుతిన్ దీనిపై మాట్లాడుతూ జాబితాలో తన పేరు చేర్చనందుకు నిరాశ చెందానని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇది విద్వేష పూరిత చర్యని, ఈ పరిణామం అమెరికా–రష్యా సంబంధాల్ని మరింత జటిలం చేసిందని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ విషయాన్ని మరింత పెద్దదిగా చేసే ఉద్దేశం తనకు లేదన్నారు. ఈ అంశాన్ని వదిలిపెట్టి దేశం గురించి, ఆర్థిక వ్యవస్థ గురించి రష్యా ఆలోచించాలని అన్నారు. రష్యా ప్రతినిధి అలెస్కీ చెపా మాట్లాడుతూ.. ఇది ఉద్రిక్తతల్ని పెంచే చర్యగా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment