ట్రంప్ నా భార్య కాదు
అమెరికా అధ్యక్షుడిపై పుతిన్ వ్యంగ్యోక్తులు
మాస్కో: ఇరు దేశాల మధ్య నెలకొన్న దౌత్య పోరు నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యంగ్యోక్తులు విసిరారు. ట్రంప్ అనుభవరాహిత్యంతో అంతర్జాతీయ వ్యవహారాల్లో ఇబ్బందులు పడుతున్నారా అన్న ప్రశ్నను పుతిన్ కొట్టిపారేశారు. ‘ట్రంప్ నా భార్య కాదు. నేను ఆయనకు భర్త కాను’ అని ఆయన చమత్కిరించినట్లు రష్యా మీడియా పేర్కొంది.
ట్రంప్ అభిశంసనకు గురైతే రష్యా ఎలా స్పందిస్తుంది అని అడినప్పుడు అమెరికా అంతరంగిక రాజకీయాలను తాము చర్చించడం సరికాదన్నారు. గతేడాది ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు రష్యా హర్షం వ్యక్తం చేసింది. తమతో సంబంధాల పునరుద్ధరణకు ట్రంప్ పాటుపడతారని ఆశించింది. అయితే రష్యాపై అమెరికా ఆంక్షలు విధించడంతో పాటు ఆ దేశ కాన్సులేట్ కార్యాలయాలను మూసివేయడంతో రెండు దేశాల మధ్యదూరం కొనసాగుతోంది.
మరింత కుదిస్తాం: పుతిన్
ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే తమ దేశంలో పనిచేస్తున్న దౌత్యవేత్తల్లో అదనంగా 155 మందిని తగ్గించేలా అమెరికాపై ఒత్తిడి పెంచుతామని పుతిన్ అన్నారు. వెంటనే ఈ చర్యలకు దిగబోమని, భవిష్యత్తులో జరిగే పరిణామాలను బట్టి తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. రష్యాలో పనిచేస్తున్న అమెరికా దౌత్యాధికారుల సంఖ్యపై పరిమితులు విధించే హక్కు తమకు ఉందన్నారు. అమెరికాలో తమ దౌత్యాదికారుల సంఖ్యను కుదించడంలో ఆ దేశం గౌరవంగా వ్యవహరించలేదని ఆరోపించారు.