సన్నగా ఉంటే దీర్ఘాయువు
బోస్టన్: సన్నగా ఉన్నవాళ్లు ఎక్కువకాలం జీవిస్తారని అమెరికాలోని హార్వర్డ్, టఫ్ట్స్ వర్సిటీల అధ్యయనంలో తేలింది. చిన్నతనం నుంచి మధ్య వయస్సు వరకు ఎక్కువగా బరువు పెరిగినవారు త్వరగా చనిపోయే అవకాశాలుంటాయని పరిశోధకులు చెప్పారు. శరీర పరిణామక్రమం, మరణాల మధ్య సంబంధంపై వారు పరిశోధనలు చేశారు. వీటిలో 80,266 మంది మహిళలు, 36,622 మంది పురుషులు పాల్గొన్నారు. వారంతా 5, 10, 20,30,40 ఏళ్లప్పుడు వారి శరీరాకృతులు ఎలా ఉండేవో చెప్పారు. 50 ఏళ్లప్పుడు వారి శరీర ద్రవ్యరాశి సూచిక(బీఎంఐ)ను నమోదు చేశారు. 60 ఏళ్ల తర్వాత వారిపై పరిశీలన ను కొనసాగించారు.
60 దాటిన తర్వాత మరో 15 ఏళ్లలోపు చనిపోయే అవకాశం సన్నగా ఉన్న మహిళల్లో 11 శాతం, పురుషుల్లో 20.3 శాతం. అదే లావుగా ఉన్నవారిలో ఇది పెరిగి మహిళల్లో 19.7 శాతం, పురుషుల్లో 24.1 శాతంగా నమోదైంది.