ఇసుకలో ఆశుకవిత్వం
‘‘రాళ్లల్లో ఇసకల్లో రాశాము ఇద్దరి పేర్లు.. కళ్లు మూసి తిన్నగా కలిపి చదువుకో ఒక్కసారి..’’ అప్పుడెప్పుడో బాలకృష్ణ హీరోగా వచ్చిన సీతారామకళ్యాణం సినిమాలోనిది ఈ పాట. ఇసుక.. అది కూడా.. సముద్ర తీరాల్లో ఇసుక కనిపించగానే మనలో చాలామంది చేసే పనేమిటి? తోచిన పేర్లు రాసేయడం.. అలల తాకిడికి అవి కొట్టుకుపోవడం... మళ్లీమళ్లీ రాసేయడం. అంతేనా! ఇంకొందరైతే.. తమ ఆశుకవిత్వాన్ని అక్కడికక్కడే ప్రచురించేస్తూంటారు. సరేగానీ.. ఫొటోలో ఉన్నది ఏంటి? ఏం చేస్తుంది? అంటున్నారా? ఇదో రోబో. అలాగని ఆషామాషీదేమీ కాదు. కృత్రిమ మేధతో పనిచేసేది. అంటే చేసిన పనుల నుంచి కొత్త కొత్త విషయాలను నేర్చుకుని తన పనితీరును మెరుగుపెట్టుకునేది అని! యుక్సీ ల్యూ అనే డిజైనర్ సిద్ధం చేసిన ఈ రోబో పేరు పొయెట్ ఆన్ షోర్.
తెలుగులో చెప్పాలంటే తీరంలో కవి! ఇప్పుడర్థమైందా ఇదేం చేస్తుందో. చాలా సింపుల్‌గా ఇసుక తిన్నెలపై దొర్లుకుంటూ వెళ్లిపోతూ.. అందమైన కవిత్వాన్ని ముద్రిస్తూ ఉంటుందన్నమాట! యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్‌బరోలో చదువుతున్న యుక్సీ ల్యూ తన పీహెచ్‌డీ కోసం ఈ రోబోను తయారు చేసిందట. రోబో పైభాగంలో గాలి వేగాన్ని కొలిచే ఓ యంత్రం ఉంటుంది. దీంతోపాటు కొన్ని వాతావరణ వివరాలనూ సేకరించిన తరువాత అలల ఆటుపోట్లను కూడా పరిశీలించి వాటి ఆధారంగానే కవితలు ముద్రించడం మొదలుపెడుతుంది ఈ రోబో.
ఇంగ్లిష్ వ్యాకరణంతోపాటు దీనికి కొన్ని పదాలను, వాటి అర్థాలను, పద నిర్మాణం ఎలా జరుగుతుంది అన్న విషయాలను నేర్పించారు. పొయెట్ ఆన్ షోర్ వీటి ఆధారంగా సొంతంగా కవితలు అల్లేస్తుంది. గాలి వేగాన్ని.. అలల సవ్వడిని... బీచ్‌లో చిన్న పిల్లల ముచ్చట్లను... పక్షుల కిలకిల రావాలను వీటన్నింటినీ వింటూ.. అనుభూతి పొందుతూ ఇది కవిత్వాన్ని సృష్టిస్తుందని ల్యూ అంటున్నారు. ఏది కవిత్వం.. ఏది కపిత్వం.. తేల్చేదెవరో మరి! – సాక్షి నాలెడ్జ్ సెంటర్