భారత్‌-రష్యా బంధం బద్దలవనుందా? | Russia throws its weight behind China Pakistan corridor | Sakshi
Sakshi News home page

భారత్‌-రష్యా బంధం బద్దలవనుందా?

Published Mon, Dec 19 2016 8:44 AM | Last Updated on Mon, Sep 4 2017 11:07 PM

భారత్‌-రష్యా బంధం బద్దలవనుందా?

భారత్‌-రష్యా బంధం బద్దలవనుందా?

న్యూఢిల్లీ: రష్యా-భారత్‌ బంధానికి బీటలు పారనున్నాయా? భవిష్యత్తులో రష్యాను ఇక భారత్‌ నమ్మలేని పరిస్థితి తలెత్తనుందా? ఈ రెండు దేశాలు పరస్పరం విరుద్ధంగా వ్యవహరించనున్నాయా? అంటే తాజాగా జరుగుతున్న పరిణామాలు అవుననే సంకేతాలు ఇస్తున్నాయి. అందుకు ప్రధాన కారణం భారత్‌కు బద్ధశత్రువులైన పాకిస్థాన్‌, చైనాలకు ఆ దేశం అండగా నిలవడమే. అవును.. పరోక్షంగా పాక్‌కు రష్యా మద్దతిచ్చింది. నెల రోజుల కిందట పాక్‌ వ్యతిరేకంగా మాట్లాడిన ఆ దేశం ఇప్పుడు బాహాటంగా మద్దతు తెలుపుతోంది. దీంతో అంతర్జాతీయ సమాజం ముందు ఉగ్రవాదానికి ఊతమందిస్తున్న పాక్‌ను ఒంటరి చేయాలన్న భారత్‌ వ్యూహాలు బెడిసికొట్టేలా కనిపిస్తున్నాయి. అసలింతకి దశాబ్దాలుగా ఉన్న రష్యా-భారత్‌ బంధాలను కదిలించి ఆ సమస్య ఏమిటని అనుకుంటున్నారా..!

పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం చైనా-పాక్‌ దేశాల మధ్య చైనా-పాకిస్థాన్‌ ఎకనామిక్‌ కారిడార్‌(సీపీఈసీ) ఏర్పాటు జరిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే, ఇది పాక్‌ లోని గ్వాదర్‌ నుంచి బలోచిస్తాన్ ప్రావిన్స్‌ గుండా చైనాలోని జిన్‌ జియాంగ్‌ వరకు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు కారిడార్‌ గిల్గిత్‌-బాల్టిస్తాన్‌ నుంచి వెళ్లనుందిజ. ఇది పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ లోని భూభాగం. ఈ భూభాగం తమదేనని భారత్‌ ఇప్పటికీ చెప్పుకుంటోంది. ఈ విషయంపై భారత్‌ ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల చైనా అధ్యక్షుడు జీ జిన్‌ పింగ్‌ తో సమావేశమైన సందర్భంలో ప్రస్తావించారు. వివాదంలో ఉన్న భూభాగం విషయంలో ఉమ్మడిగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టవద్దని చెప్పారు. అలాంటి చర్య సరికాదని కూడా గుర్తు చేశారు.

అయినప్పటికీ ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టును ఆపేస్తామని ఇప్పటి వరకు ఎలాంటి రాకపోగా తాజాగా తెరమీదకు రష్యా వచ్చింది. గత నెలలోనే సీపీఈసీ విషయంలో కలగజేసుకోని భాగస్వామ్యం అయ్యేందుకు రష్యా తహతహలాడుతోందంటూ పాక్‌ మీడియా వార్తలు వెలువరించగా వాటిని ఆ దేశం ఖండించింది. కానీ తాజాగా ఏకంగా పాక్‌కు రష్యా తరుపున రాయబారిగా వ్యవహరిస్తున్న అలెక్సీ వై దేదోవ్‌ మాత్రం భారత్‌ షాక్‌ గురయ్యే ప్రకటన చేశాడు.

సీపీఈసీకి తాము మద్దతిస్తున్నామని, పాక్‌ ఆర్థిక వ్యవస్థకు ఆ ప్రాజెక్టు చాలా అవసరం అని పేర్కొన్నారు. అంతే కాకుండా సీపీఈసీకు తమ యురేషియన్‌ ఎకనామిక్‌ యూనియన్‌ ప్రాజెక్టుతో సంబంధం కలుపుదామనుకుంటున్నామని ప్రకటించారు. దీనిపై భారత వ్యూహాత్మక వ్యవహారాల నిపుణులు బ్రహ్మ చెల్లానీ స్పందిస్తూ మాస్కో చేస్తున్న గందరగోళ ప్రకటనలతో భారత్‌-రష్యాల బంధం బలహీనమవుతుందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. భారత్‌ ఇక రష్యాను నమ్మదగిన స్నేహితుడిగా ఎక్కువకాలం గుర్తించలేకపోవచ్చేమోనని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement