ఉప్పునీటితో రయ్ రయ్...
ఈ స్పోర్ట్స్ కారు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది కదూ? కారే కాదు.. దీని ప్రత్యేకతలు మరింతగా మన మదిని దోచుకుంటాయి. సాధారణంగా స్పోర్ట్స్ కార్లు ఎక్కువ పెట్రోలు తాగుతాయి.. తక్కువ మైలేజీ ఇస్తాయి.. వెరసి నిర్వహణ వ్యయం తడిసి మోపెడవుతుంది. పైగా పర్యావరణానికి ఏమాత్రం అనుకూలంగా ఉండవు. కానీ ఈ కారు వాటన్నింటికీ భిన్నమైంది. దీని పేరు క్వాంట్-ఎ-స్పోర్ట్‌లైమోసిన్. పూర్తిగా పర్యావరణ అనుకూలమైనది. అంతేకాదు.. దీనికి పెట్రోలు, డీజిల్ లేదా గ్యాస్ ఏదీ అవసరం లేదు.
మరి ఎలా నడుస్తుందా అని అనుకుంటున్నారా? ఉప్పునీటితో..! ఔను.. పెట్రోల్ బదులు ఉప్పునీరు పోస్తే చాలు.. రయ్ రయ్ మంటూ పరుగులు పెడుతుంది. దీని గరిష్టవేగం ఎంతో తెలుసా? గంటకు ఏకంగా 350 కిలోమీటర్లు. దాదాపు 2,300 కిలోల బరువున్న ఈ కారు.. సున్నా నుంచి వంద కిలోమీటర్ల వేగాన్ని కేవలం 2.8 సెకన్లలోనే అందుకుంటుంది. 200 లీటర్ల సామర్థ్యమున్న రెండు ట్యాంకులను పూర్తిగా ఉప్పునీటితో నింపితే.. దాదాపు 600 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు. త్వరలోనే ఐరోపా రోడ్లపై ఇది పరుగులు పెట్టనుంది. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ కారు ధర కాస్త ఎక్కువే. ప్రస్తుతానికి దీని ధర ప్రకటించకపోయినా, దాదాపు రూ.10 కోట్లపైనే ఉంటుందని అంచనా.