ఇంతకూ వైరస్‌ల మొత్తం సంఖ్య ఎంతో తెలుసా..!! | Scientists Estimate About 10 Thousand Times More Viruses Than Humans | Sakshi
Sakshi News home page

ఒక్కో వైరస్‌ శక్తి తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!

Published Sun, Feb 9 2020 1:04 PM | Last Updated on Sun, Feb 9 2020 1:20 PM

Scientists Estimate About 10 Thousand Times More Viruses Than Humans - Sakshi

వైరస్‌.. ఈ పేరు వింటేనే ప్రపంచ దేశాలు ఈ మధ్య గడగడలాడిపోతున్నాయి. సార్స్‌ నుంచి కరోనా వరకు దశాబ్దకాలంగా కనీవినీ ఎరుగని కొత్త వైరస్‌లు, వాటి ద్వారా సంక్రమించే వ్యాధులు వివిధ దేశాలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఈ వ్యాధులపై గట్టి పోరాటమే చేస్తోంది. ఈ వ్యాధులతో ప్రాణనష్టంతో పాటు, వైరస్‌ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి ప్రయాణాలపై ఆంక్షలు, ఎగుమతి దిగుమతులపై నియంత్రణల కారణంగా చాలా దేశాలు ఆర్థికంగానూ నష్టపోతున్నాయి. ఇప్పుడు చైనాలో కరోనా వ్యాధి ప్రబలడంతో ప్రాణాంతక వైరస్‌లు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. కొన్ని వైరస్‌లకు చికిత్సలు ఉండటం లేదు. నివారణ ఒక్కటే మార్గం. అసలు ఏమిటీ వైరస్‌లు? ఇటీవల కాలంలో వివిధ దేశాల్ని ఎలా వణికించాయి? కరోనా వైరస్‌పై పోరాటం చేయడానికి చైనా చేస్తున్నదేంటి? ఇదే ఇవాళ్టి సండే స్పెషల్‌...

3,20,000 రకాల వైరస్‌లు
వైరస్‌ అంటే లాటిన్‌ భాషలో విషం అని అర్థం. ఇవి సూక్ష్మాతి సూక్ష్మమైన జీవులే కానీ అత్యంత శక్తిమంతమైనవి. బ్యాక్టీరియా, ఫంగస్‌ కంటే ఇవి చాలా శక్తిమంతంగా దాడి చేస్తాయి. ఇవి కంటికి కనిపించవు. కొన్ని రకాల వాటిని మైక్రోస్కోప్‌ల ద్వారా చూడగలం. ఈ వైరస్‌లు సంతానాన్ని వాటంతట అవి సృష్టించలేవు. కణజాలం ఉంటేనే ఇవి అభివృద్ధి చెందుతాయి. అడవి జంతువులు, మొక్కల నుంచి ఈ వైరస్‌లు మానవ శరీరాలపై దాడి చేస్తాయి. దీంతో మానవాళిని వివిధ రకాల వ్యాధులు భయపెడుతున్నాయి. ఫ్లూ, ఎబోలా, జికా, డెంగీ, సార్స్, మెర్స్‌ ఇప్పుడు కరోనా వీటన్నింటికీ వైరస్‌లే కారణం. మన శరీరంలోకి ఒక్కసారి ఈ వైరస్‌ ప్రవేశించిందో ఇక అది ఉత్పత్తి ఫ్యాక్టరీగా మారిపోతుంది. ఒక్క వైరస్‌ మరో 10 వేల కొత్త వైరస్‌లను సృష్టించే సామర్థ్యం ఉంటుంది. అందుకే భూమ్మీద ఉండే మనుషుల కంటే 10 వేల రెట్లు ఎక్కువ వైరస్‌లు ఉన్నాయని శాస్త్రవేత్తల అంచనా.

మన శరీరంలో కూడా ఎన్నో వైరస్‌లు ఉన్నప్పటికీ చాలా వైరస్‌లు నిద్రాణ స్థితిలో ఉంటాయి. అందుకే వాటి వల్ల హాని జరగదు. అయితే మనిషిలో రోగ నిరోధక వ్యవస్థ నిర్వీర్యం అయిపోతే మాత్రం ఈ వైరస్‌లు విజృంభిస్తాయి. అంతుపట్టని వ్యాధులకు కారణమవుతాయి. ముఖ్యంగా దగ్గు, జలుబు, శ్వాసకోశ సమస్యలతో ఈ వైరస్‌ల దాడి మొదలవుతుంది. చివరికి జ్వరం, రక్తస్రావం వంటి వాటికి దారి తీసి ప్రాణాలే పోతాయి. వైరస్‌లన్నీ హానికరమైనవే. మనిషిలో రోగాలను ఎదుర్కొనే శక్తిని బట్టే వాటి విజృంభన ఉంటుంది. అయితే కొన్ని మాత్రమే ప్రాణాంతక వైరస్‌లు ఉంటాయి. అమెరికన్‌ జర్నల్‌ సొసైటీ ఆఫ్‌ మైక్రో బయోలజీ అంచనాల ప్రకారం ఈ భూమి మీద 3 లక్షల 20 వేల రకాల వ్యాధికారక వైరస్‌లు ఉన్నాయి. 

ఎబోలా...
పుట్టిన ప్రాంతం: ఆఫ్రికా
ఎలా సంక్రమిస్తుంది: గబ్బిలాలు
మరణాల రేటు: 50%

ప్రాణాంతకమైన ఎబోలా వైరస్‌ డిసీజ్‌ (ఈవీడీ) జర్వం, ఒళ్లు నొప్పులు, వాంతులు, విరోచనాలతో మొదలవుతుంది. ఒక్కోసారి శరీరం వెలుపల, లోపల కూడా రక్తస్రావం అవుతుంది. చివరికి బ్రెయిన్‌ హెమరేజ్‌తో మనిషి ప్రాణాలే పోతాయి. మొట్టమొదటిసారి 1976లో ఆఫ్రికాలో ఈ వైరస్‌ బట్టబయలైంది. సూడాన్, రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగో దేశాల్లో ఒకేసారి వ్యాప్తి చెందిన ఈ వైరస్‌ ఇంకా ప్రపంచ దేశాలను వణికిస్తూనే ఉంది. ఆఫ్రికాలో ప్రవహించే నది ఎబోలా పేరునే ఈ వైరస్‌కు పెట్టారు. ఫ్రూట్‌ గబ్బిలాల నుంచి ఈ వైరస్‌ సంక్రమిస్తుంది. ఆ తర్వాత మనిషి నుంచి మనిషికి విస్తరిస్తుంది.

గాయాలు, రక్తం, లాలాజలం ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. అప్పట్లో ఈ వైరస్‌ సోకిన వారిలో 90% మంది ప్రాణాలు కోల్పోయారు. 2014–16 మధ్య మళ్లీ ఈ వ్యాధి విజృంభించింది. అయితే మొత్తం కేసుల్లో మరణాల రేటు 50 శాతంగా ఉంది. ఆ రెండేళ్లలోనే దాదాపుగా 12 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పుడే డబ్ల్యూహెచ్‌ఓ అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఈ వైరస్‌కు చికిత్స కోసం మందుని కనుక్కొనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ వైరస్‌ రాకుండా వ్యాక్సినేషన్‌ కూడా ప్రయోగాల దశలో ఉంది. 

డెంగీ...
పుట్టిన ప్రాంతం: ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్‌
ఎలా సంక్రమిస్తుంది: దోమలు
మరణాల రేటు: 20%

కొన్ని వందల ఏళ్ల క్రితమే డెంగీ వైరస్‌ ఆఫ్రికా దేశాలను అతలాకుతలం చేసింది. ఇప్పుడు 20వ శతాబ్దంలో ఈ వైరస్‌ 1950లో ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్‌లో తొలిసారిగా బయటకి వచ్చింది. అక్కడ్నుంచి ఆసియా పసిఫిక్, కరేబియన్‌ దేశాలను వణికిస్తోంది. భారత్‌లో కూడా ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంది. ఏడెస్‌ దోమ కాటుతో ఈ వ్యాధి సంక్రమిస్తుంది. నీళ్లు నిల్వ ఉన్న ప్రాంతాల్లో ఏడెస్‌ వేగంగా వృద్ధి చెందుతుంది. దీనిని టైగర్‌ దోమ అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం ప్రపంచ జనాభాలో 40 శాతం మంది డెంగీ వ్యాధి ప్రబలే ప్రాంతాల్లో నివసిస్తున్నారు. డబ్ల్యూహెచ్‌ఓ గణాంకాల ప్రకారం ప్రతీ ఏడాది డెంగీ 5 కోట్ల నుంచి 10 కోట్ల మందికి సంక్రమిస్తుంది. వారం రోజులకు పైగా జ్వరంతో మనిషిని పీల్చి పిప్పిచేస్తుంది. ఒక్కోసారి డెంగీ జ్వరం తీవ్రత ఎక్కువై బ్రెయిన్‌ హెమరేజ్‌ వచ్చి ప్రాణాలు కోల్పోతారు. ఇలా మృతి చెందేవారు ప్రపంచ దేశాల్లో ఏడాదికి 25 వేల మంది వరకు ఉంటారని అంచనా. ప్రపంచ వ్యాప్తంగా దోమల్ని అరికట్టే కార్యక్రమాలు డబ్ల్యూహెచ్‌ఓ ఆధ్వర్యంలో వివిధ దేశాల్లో స్వచ్ఛంద సంస్థలు చేపడుతూ ఉండటంతో డెంగీ కేసులు కాస్తయినా నివారించగలుగుతున్నారు. 

స్వైన్‌ఫ్లూ (హెచ్‌1ఎన్‌1)
పుట్టిన ప్రాంతం: ఆఫ్రికా
ఎలా సంక్రమిస్తుంది: పందులు
మరణాల రేటు: 10%

స్వైన్‌ఫ్లూ వ్యాధి మొట్టమొదట పందుల్లో బయటపడింది. ఇది మనుషులకి సోకడం తక్కువే. 1918–19 సంవత్సరాల్లో తొలిసారిగా ఇది మనుషులకి సోకింది. అప్పట్లోనే ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల మందికి ఈ వైరస్‌ సోకిందని అంచనాలున్నాయి. ఆ తర్వాత మళ్లీ 2009లో ఒక్కసారిగా ఈ వ్యాధి మనుషులకి సోకి తన విశ్వరూపం చూపించింది. మొత్తం 200 దేశాలకు విస్తరించింది. దాదాపుగా 3 లక్షల మంది ఈ వ్యాధితో మరణించారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. జలుబు, దగ్గు, గొంతు నొప్పి, తలనొప్పితో ఈ వైరస్‌ లక్షణాలు బయటకొస్తాయి. జ్వరం, డయేరియా వస్తే మాత్రం ఇది ప్రాణాంతకంగా మారుతోంది.

సార్స్‌...
పుట్టిన ప్రాంతం: చైనా
ఎలా సంక్రమిస్తుంది: గబ్బిలాలు, పిల్లులు
మరణాల రేటు: 10%

చైనాలో గూంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌లో 2002లో తొలిసారిగా సివియర్‌ అక్యూట్‌ రెస్పరేటరీ డిసీజ్‌ (సార్స్‌) వైరస్‌ బయటపడింది. కొద్ది వారాల్లోనే ఆ వైరస్‌ 37 దేశాలకు పాకింది. జ్వరం, దగ్గు, తలనొప్పి, కండరాల నొప్పులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఈ వ్యాధి లక్షణాలు. సార్స్‌ వ్యాధితో చైనా, హాంకాంగ్‌లోనే అత్యధిక మరణాలు సంభవించాయి. ఈ వైరస్‌ వచ్చిన తర్వాత ఒక దేశం నుంచి మరో దేశానికి ప్రయాణాలపై నిషేధాలు, ఆ దేశాల్లో ఉన్న తమ పౌరుల్ని వివిధ దేశాలు వెనక్కి తీసుకురావడం వంటి చర్యలు మొదలయ్యాయి.

సార్స్‌ వ్యాధిని నియంత్రించడానికి చైనా, హాంకాంగ్, కెనడా, తైవాన్‌ వంటి దేశాలపై ఆంక్షలు విధించడంతో ఆర్థికపరమైన నష్టాలు కూడా మొదలయ్యాయి. డబ్ల్యూహెచ్‌ఓ ప్రకారం సార్స్‌ వ్యాధితో 2002–03లో 774 మంది మరణించారు. కొన్ని వేల మందిపై ఈ వైరస్‌ దాడి చేసింది. చాలా ఏళ్లుగా సార్స్‌ని నిరోధించే వ్యాక్సిన్‌ తయారు చేయడానికి వైద్య నిపుణులు ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇంకా అవి సఫలం కాలేదు. ఇలాంటి ప్రాణాంతక వ్యాధికారక వైరస్‌లకు చికిత్సలు ఉండవు. నియంత్రణే మార్గం. ఈ వైరస్‌ మళ్లీ విజృంభించినప్పుడల్లా డబ్ల్యూహెచ్‌ఓ వైరస్‌ సోకకుండా ముందు జాగ్రత్త చర్యలపైనే విస్తృతంగా ప్రచారం చేస్తోంది.  

జికా...
పుట్టిన ప్రాంతం: ఉగాండా
ఎలా సంక్రమిస్తుంది: దోమలు
మరణాల రేటు: 9%

డెంగీ తరహాలోనే జికా వైరస్‌ కూడా ఏడెస్‌ దోమ ద్వారా వస్తుంది. జ్వరం, ఒళ్లంతా దద్దుర్లు, కంటికి కలక, కీళ్ల నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. 1947లో ఉగాండాలో తొలిసారిగా ఈ వైరస్‌ కోతుల్లో కనపడింది. 1952 సంవత్సరం నాటికి ఈ వ్యాధి మనుషులకీ సంక్రమించింది. ఉగాండా, యునైటెడ్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ టాంజానియాలో ఈ వ్యాధి ప్రబలింది. 1960–80 మధ్య కాలంలో ఈ వ్యాధి అమెరికా, ఆసియా, పసిఫిక్‌ దేశాలకు వ్యాపించింది. 2013లో ఈ వ్యాధి ఒక్కసారిగా ఫ్రాన్స్‌లో విజృంభించింది. 30 వేల మందికి ఈ వ్యాధి సంక్రమించింది. అప్పుడే ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి.

అయితే ఈ వైరస్‌ త్వరగానే అదుపులోకి వస్తుంది. రోగ నిరోధక శక్తి బాగా కలిగి ఉండేవారికి ఈ వ్యాధి సోకే అవకాశాలు తక్కువ. 2015లో బ్రెజిల్‌ని కూడా జికా వణికించింది. గర్భిణులకు ఈ వ్యాధి సోకి గర్భస్థ శిశువులకీ సంక్రమించడం ఆందోళన కలిగించే అంశం. జికా వ్యాధితో పుట్టిన శిశువుల్లో మెదడు సక్రమంగా ఎదగదు. 2016లో జికాని అదుపు చేయడానికి డబ్ల్యూహెచ్‌ఓ అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించింది. దోమకాటుతో పాటు, లైంగిక సంపర్కం, రక్తం ద్వారా ఈ వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. 

వైరస్‌ ప్రూఫ్‌ కారు..!
ఎన్నో రకాల వ్యాధికారక వైరస్‌లు చైనాలోనే బయటపడ్డాయి. సార్స్‌ నుంచి ఇప్పుడు కరోనా దాకా రకరకాల వైరస్‌లపై చైనా పోరాటం చేస్తూనే ఉంది. కరోనా వైరస్‌ దాటికి బెంబేలెత్తిన చైనా కేవలం పదంటే పది రోజుల్లోనే ఆస్పత్రిని నిర్మించింది. ఇప్పుడు వైరస్‌ని నిరోధించే కార్ల తయారీ పనిలో పడింది. జిలీ గ్రూప్‌ వైరస్‌లను నిరోధించే, గాలిని ప్యూరిఫై చేసే ఫిల్టర్లు ఏర్పాటు చేసేలా కార్లను అభివృద్ధి పరుస్తోంది. ఈ కార్లను ఆరోగ్యకరమైన, తెలివైన కార్లుగా ఆ కంపెనీ అభివర్ణిస్తోంది. యూరప్, అమెరికా, చైనాలో ఉన్న జిలీ ఆటోస్‌ గ్లోబల్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌ డిజైన్‌ నెట్‌వర్క్‌ వాతావరణంలో వస్తున్న మార్పులకి అనుగుణంగా కార్ల డిజైన్లను తయారు చేస్తుంది. బ్యాక్టీరియా నిరోధక, వైరల్‌ నిరోధక సాంకేతిక వ్యవస్థను ఈ కార్లలో పొందుపరుస్తూ కొత్త కార్లను తీసుకురానుంది. 

 ‘ఇవాళ రేపు ప్రజలు ఇళ్లలో గడిపే సమయం తర్వాత అత్యధికంగా ప్రయాణాల్లోనూ, అందులోనూ కార్లలోనే గడుపుతున్నారు. వాటిపైనే చైనా ప్రజలు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. అందుకే కారు ప్రయాణాల్లో వారికి ఎలాంటి వైరస్‌లు సోకకుండా కొత్త తరహా కార్లను తయారు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం’
 – ‘జిలీ’ అధ్యక్షుడు అన్‌ కాంఘై

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement