లండన్ : ‘మనిషన్న జంతువు ప్రతిచోట విధ్వంసం సృష్టిస్తోంది’ అంటూ కోర్టులు మొట్టికాయలు వేసినా మనుషుల తీరు మాత్రం మారడం లేదు. ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారం పడేస్తూ భూగ్రహం మీద ఉన్న ఇతర జీవజాతులను ప్రమాదంలోకి నెడుతున్నారు. యునైటెడ్ కింగ్‌డంలోని డోనా నూక్ నేచర్ రిజర్వులో అప్పుడే పుట్టిన ఓ సీల్ పప్(సముద్ర జీవి సీల్ పిల్ల) గాజు సీసాతో ఆడుకుంటున్న ఫొటో ఇందుకు తార్కాణంగా నిలిచింది. పర్యావరణాన్ని మానవుడు కలుషితం చేస్తున్న తీరును మరోసారి కళ్లకు కట్టింది. నేచర్ ఫొటోగ్రాఫర్ డాన్ థర్లింగ్ రెండు వారాల క్రితం ఫేస్‌బుక్‌లో షేర్ చేసిన సీల్ పప్ ఫొటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ‘ మనుషులు ఇలా ఎందుకు చేస్తారో నాకు అస్సలు అర్థం కావడం లేదు. ఈ భూగ్రహానికి మనం విలువ ఇవ్వనక్కర్లేదా?’అంటూ డాన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఒకవేళ అలాంటి బాటిళ్లు ఇంకా అక్కడే ఉంటే సీల్ పప్ వంటి అద్భుతమైన, అరుదైన జంతువుల మనుగడ ఎలా కొనసాగుతుందని ప్రశ్నించాడు.
కాగా ఈ ఫొటోలో సీల్ పప్.. గ్లోబల్ కాఫీ చైన్ స్టార్‌బక్స్ బాటిల్‌తో కనిపించడంపై ఆ సంస్థ విచారం వ్యక్తం చేసింది. తమ సంస్థ బాటిల్ కారణంగా సీల్ పిల్లకు ఎలాంటి హాని జరగలేదనే ఆశిస్తున్నామంది. ఈ మేరకు స్టార్‌బక్స్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ...’ఈ ఫొటో మమ్మల్ని ఎంతగానో కలచివేసింది’ అని విచారం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో లింకోల్నిషైర్ వైల్‌్డలైఫ్ ట్రస్టును సంప్రదించి చెత్త నిర్వహణ దిశగా చేపట్టే చర్యలకు తమవంతు సహాయం చేస్తామని పేర్కొన్నారు. ఇందుకు బదులుగా లింకోల్నిషైర్ వైల్‌్డలైఫ్ ట్రస్టు స్టార్‌బక్స్‌కు ధన్యవాదాలు తెలిపింది. ట్రస్టు ప్రతినిధి మాట్లాడుతూ.. ‘ సముద్ర జలాల్లో చెత్త పేరుకుపోవడం జాతీయ సమస్యగా పరిణమించింది. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ప్రభుత్వాలు చెబుతున్నా పరిస్థితుల్లో మార్పులు రావడం లేదు’ అని పేర్కొన్నారు. కాగా ఇటీవలే ఇటువంటి ఫొటోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. చనిపోయిన పిల్ల తాబేలు కడుపులో నుంచి సుమారు 104 ప్లాస్టిక్ వస్తువులు బయటపడ్డాయి.
పిల్లలకు జన్మనివ్వడానికే బయటికి..
ప్రపంచంలో మొత్తం ముప్ఫై మూడు రకాల సీల్స్ ఉన్నాయి. మగ సీల్‌ను ‘బుల్’, ఆడ సీల్‌ను ‘కౌ’ అంటారు. ఇవి సంవత్సరానికో బిడ్డను కంటాయి. ఈ పిల్లను పప్ అంటారు. పిల్లలను నెల రోజుల పాటు వాటిని సాకి, తరువాత స్వేచ్ఛగా వదిలేస్తాయి. సీల్స్ జీవితంలో చాలాభాగం నీటిలోనే గడుపుతాయి. పిల్లలకు జన్మనివ్వడానికి, చర్మం విడవాల్సినప్పుడు (సంవత్సరానికోసారి) మాత్రమే నేలమీద కాస్త ఎక్కువసేపు ఉంటాయి. ఆక్సిజన్‌ని పీల్చుకోవడం కోసం ఇవి ఒక్కోసారి రెండేసి గంటలపాటు ఊపిరి తీసుకోకుండా నీటి అడుగున నిశ్చలంగా ఉండిపోతాయి. నీటిలో అన్నీ స్పష్టంగా చూడగలిగే విధంగా వీటి కంటి నిర్మాణం ఉంటుంది. వీటికి కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. నీటిలో పడవ లేదా ఓడ వెళ్తున్నప్పుడు, అదేంటో తెలుసుకోవాలని ఇవి చాలా సేపు ఫాలో అవుతాయట. ఆడ సీల్స్ వేరే గ్రూపుగా, మగవి వేరే గ్రూపుగా ఏర్పడి మరీ షికార్లు చేస్తాయట. మగ గ్రూపును పాడ్ అని, ఆడ గ్రూపును హారెమ్ అని అంటారు.
సీల్స్ చర్మం అడుగున ఒక మందమైన పొరలాగా కొవ్వు ఉంటుంది. దానివల్ల అవి ఎంతటి శీతలాన్నయినా తట్టుకోగలవు. ఇవి నీటిలో ఉండే వాటిని, నీటి ఉపరితలం మీద ఉన్నవాటిని ఒకేసారి స్పష్టంగా చూడగలుగుతాయట. సీల్స్ ప్రధాన ఆహారం చేపలు. కొన్ని కిలోమీటర్ల దూరంలో చేప ఉన్నా ఇవి పసిగట్టేస్తాయి. క్షణాల్లో వెళ్లి వాటిని పట్టేసేంత షార్ప్‌గా ఉంటాయి. తిండి కోసం వేయి అడుగుల లోతుకైనా వెళ్తాయి. సీల్స్ ఒంటి నుంచి తీసిన కొవ్వుతో నూనెను తయారు చేస్తారు. నల్ల సీల్ చర్మానికి చాలా డిమాండ్ ఉంటుంది. దానితో బట్టలు తయారు చేస్తారు. వీటి కోసమే విపరీతంగా వేటాడటంతో... సీల్స్ సంఖ్య అంతకంతకూ తగ్గిపోతోంది. ప్రస్తుతం సముద్రం కలుషితమవుతుండటంతో వాటి ప్రాణాలకు ప్రమాదం వాటిల్లే అవకాశాలు ఎక్కువవుతున్నాయంటూ జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment