శరీరంతో ‘రహస్యం’ చేరవేత!
వాషింగ్టన్: స్మార్ట్ ఫోన్లలోని వేలిముద్రల సెన్సార్లు, ల్యాప్‌టాప్ టచ్‌ప్యాడ్‌లను ఉపయోగించి పాస్‌వర్డ్‌లను మానవశరీరం ద్వారా మరొకరికి చేరవేసే మార్గాన్ని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. సాధారణంగా గాలి ద్వారా పాస్‌వర్డ్‌లను పంపడం ద్వారా హ్యాకింగ్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. ఒక పరికరం నుంచి మరో పరికరానికి పంపే రహస్య అంశాలు ‘ఆన్ బాడీ’ ట్రాన్స్‌మిషన్ ద్వారా ఎంతో సురక్షితంగా ఉంటాయని పేర్కొంటున్నారు.
ఇప్పటి వరకు వేలిముద్రలను ఏదైనా పరికరాన్ని అన్‌లాక్ చేసేందుకు వినియోగించారు. అయితే దీన్ని తొలిసారిగా వేరే పరికరానికి సమాచారం చేరవేసేందుకు ఉపయోగించినట్లు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్‌కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్యాం గొల్లకోట తెలిపారు. ‘ఒక వేలితో డోర్‌ను తాకి, మరో వేలితో స్మార్ట్‌ఫోన్ వేలిముద్రల సెన్సార్లపై వేలిని ఉంచినట్లయితే స్మార్ట్ లాక్‌తో పనిచేసే డోర్ తెరుచుకుంటుంది’ అని తెలిపారు.