
ఆ స్పీకర్ కథ ముగిసింది.. ఇక జైలులోనే..!
యూఎస్ఏ: న్యూయార్క్ రాజకీయాల్లో సుధీర్ఘకాలంపాటు ఒక వెలుగు వెలిగిన షెల్డాన్ సిల్వర్ చరిత్ర దాదాపు ముగిసిపోయింది. ఇక్కడ స్పీకర్ గా కూడా పనిచేసిన ఆయన జైలు పాలయ్యాడు. మోసం, బలవంతపు వసూళ్ల ఆరోపణల కింద మన్ హట్టన్ ఫెడరల్ కోర్టు జడ్జి వాలెరిక్ ఈ కాప్రోని షెల్డాన్కు పన్నేండేళ్ల జైలు శిక్షను విధించారు. దీంతో ఆయన ఇక జైలు జీవితం గడపడం తప్పనిసరైంది. దీంతోపాటు ఆయనకు కోర్టు 1.75 మిలియన్ డాలర్లను ఫైన్ గా విధించింది.
అలాగే, 5.3 మిలియన్ల డాలర్ల ఆస్తిని ప్రభుత్వం జప్తు చేయాలని ఆదేశించింది. న్యూయార్క్ స్టేట్ అసెంబ్లీ స్పీకర్ గా షెల్డాన్ సిల్వర్ దాదాపు రెండు దశాబ్దాలపాటు నిర్వహించాడు. ఆయనను అరెస్టు చేసేంతవరకు కూడా ఆయన స్పీకర్ బాధ్యతల్లోనే ఉన్నాడు. 2015 జనవరిలో షెల్డాన్ ను పోలీసులు అరెస్టు చేశారు. తన అధికారాన్ని ఉపయోగించి దాదాపు 4 మిలియన్ డాలర్లను లంఛంగా తీసుకున్నాడని, బెదిరింపులకు పాల్పడుతూ లెక్కలేనన్ని వసూళ్లు చేశారని షెల్డాన్ పై ఆరోపణలు నిరూపితమయ్యాయి.