
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ సంతతికి చెందిన 14 ఏళ్ల సిక్కు బాలుడిపై విద్వేషపూరిత దాడి జరిగింది. వాషింగ్టన్‌లో అతని సహ విద్యార్థి బాలుడిపై దాడికి పాల్పడ్డాడు. భారతీయ సంతతికి చెందడం వల్ల తమ కుమారుడిని టార్గెట్ చేశారని, ఇది కచ్చితంగా విద్వేషపూరిత దాడేనని బాలుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. స్నాప్‌చాట్‌లో పోస్టు అయిన ఈ వీడియో వైరల్ అయింది. ఈ ఘటనపై విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ సీరియస్ అయ్యారు. వెంటనే తనకు రిపోర్టు అందజేయాలని భారత రాయబార కార్యాలయాన్ని సుష్మాస్వరాజ్ ఆదేశించారు. ఈ ఘటనపై స్థానిక అథారిటీలు కూడా విచారణ జరుపుతున్నాయి. ఆ బాలుడి సంతతికి, ఈ ఘటనకు ఎలాంటి సంబంధం లేదని స్కూల్ అధికారులు చెబుతున్నారు. కేవలం ఇది క్లాస్‌రూమ్ గొడవేనని అంటున్నారు.
అయితే దాడికి పాల్పడ్డ సహ విద్యార్థితో తమ కొడుకు అసలు మాట్లాడడని బాలుడి తండ్రి ఓ న్యూస్ ఛానల్‌కు చెప్పారు. ''నా కొడుకుకు ఇలాంటి ఘటన జరుగడం నిజంగా నాకు చాలా బాధకరంగా ఉంది. అతనితో నా కొడుకు అసలు మాట్లాడడు. అతని పేరు కూడా తెలియదు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరిగితే నేను సహించను'' అని బాలుడి తండ్రి అన్నారు. ఇటీవల నెలలో విద్వేషపూరిత దాడులు విపరీతంగా పెరుగుతున్నాయి. సిక్కు కమ్యూనిటీలపై ఈ దాడులు మరింత జరుగుతున్నాయి. సెప్టెంబర్ 11 దాడి అనంతరం సిక్కు కమ్యూనిటీని విపరీతంగా టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment