అమెరికాలో సిక్కు వృద్ధుడిపై జాతివివక్ష
అమెరికాలో భారతీయుల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది. విమానంలో ప్రయాణిస్తూ నిద్రపోతున్న ఓ సిక్కు వృద్ధుడిని సహ ప్రయాణికుడు ఒకరు వీడియో తీసి, దాన్ని ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసి, తాను బిన్ లాడెన్‌తో ప్రయాణిస్తున్నానని, ఇలాంటప్పుడు మీరు సురక్షితంగా ఉండగలరా అని దానికి టైటిల్ పెట్టాడు. జెట్‌బ్లూ విమానంలో న్యూయార్క్ నుంచి కాలిఫోర్నియాకు వెళ్తున్న దర్శన్ సింగ్‌కు ఈ చేదు అనుభవం ఎదురైంది. ఈ ఘటన నవంబర్‌లో జరిగింది. దీనిపై ఆ ప్రయాణికుడితో దర్శన్ సింగ్ అసలు ఏమీ మాట్లాడలేదు. కానీ తర్వాత వీడియోను యూట్యూబ్‌లో చూసి ఆశ్చర్యపోయారు. 39 సెకన్ల పాటు ఉన్న ఆ వీడియోను 83 వేల మంది చూశారు.
ఈ విషయాన్ని దర్శన్ సింగ్ కుమార్తె (20) యునైటడ్ సిఖ్స్ అనే సంఘం డైరెక్టర్ మన్వీందర్ సింగ్‌కు ఫిర్యాదుచేసింది. ఇటీవలి కాలంలో సిక్కులకు వ్యతిరేకంగా ఇలాంటి వ్యవహారాలు ఎక్కువవుతున్నాయని ఆయన అన్నారు. ఇంతకుముందు ఈనెల 6వ తేదీన ఐఎస్ఐఎస్ వ్యతిరేక బృందం వాళ్లు ఓ గురుద్వారాను తగలబెట్టారు. అదేరోజు నలుగురు సిక్కు యువకులను తలపాగా ఉందన్న కారణంగా పుట్‌బాల్ గేమ్ వద్దకు రానివ్వకుండా అడ్డుకున్నారు. ఇక దర్శన్ సింగ్ వీడియోను చూసినవాళ్లలో వందలాదిమంది ఆ వీడియో తీసిన వ్యక్తి చేష్టలను ఖండిస్తూ కామెంట్లు పెట్టారు. దానికి 1170 డిస్‌లైక్‌లు వచ్చాయి. ఆ వీడియోను యూట్యూబ్ నుంచి తీయించడానికి యునైటెడ్ సిఖ్స్ సంస్థ ప్రయత్నిస్తోంది.