ఒక రోజు అమ్మాయిగా, మరో రోజు అబ్బాయిగా.... | Some days Annie is a girl, some days Annie is a boy and some days she's both | Sakshi
Sakshi News home page

ఒక రోజు అమ్మాయిగా, మరో రోజు అబ్బాయిగా....

Published Thu, Mar 24 2016 8:20 PM | Last Updated on Fri, Jul 12 2019 3:02 PM

ఒక రోజు అమ్మాయిగా, మరో రోజు అబ్బాయిగా.... - Sakshi

ఒక రోజు అమ్మాయిగా, మరో రోజు అబ్బాయిగా....

సిడ్నీ: ‘అన్నీ’ అనే ఆస్ట్రేలియాకు చెందిన విద్యార్థి లేదా విద్యార్థిని చాలా చిత్రమైన సమస్యను ఎదుర్కొంటున్నారు. ఒక రోజు మగవాడిలా, మరో రోజు ఆడపిల్లలా ప్రవర్తిస్తున్నారు. ఒక రోజు నెత్తిన ఫూలు పెట్టుకొని స్కర్టు వేసుకుంటే మరో రోజు క్రాఫ్ దువ్వుకొని కోటు వేసుకుంటున్నారు. ఆమె లేదా అతనికి ఇప్పుడు 12 ఏళ్లు. ప్రధానంగా పదవ ఏటనే ఈ సమస్య ఉత్పన్నమైంది.

‘అన్నీ’ని చిన్నప్పటి నుంచి అమ్మాయిలాగా పెంచారు. పదవ ఏట అడుగుపెట్టగానే పురుష లక్షణాలు బయటపడ్డాయి. పోనీ పురుషుడిగా గుర్తిద్దామంటే వారం రోజులకన్నా ఎక్కువగా ఆ లక్షణాలు ఉండడం లేదు. మళ్లీ ఆడ లక్షణాలు వస్తున్నాయి. అలా మొదట వారానికోసారి మారే ఆడ, మగ లక్షణాలు ఇప్పుడు రోజు రోజుకు మారుతున్నాయి. ఈ సమస్యను వైద్య పరిభాషలో ‘జెండర్ ఫ్లూయిడ్ లేదా నాన్ బైనరీ చిల్డ్రన్’ అని పిలుస్తారు.

‘నేను ఓ రోజు మార్నింగ్ వాక్‌కు వెళ్లిరాగానే నేను పూర్తిగా మగవాడినని అనిపిస్తుంది. నూటికి నూరు శాతం మగవాడిననే విశ్వసిస్తాను. అలాగే ప్రవర్తిస్తాను. మరో రోజు ఆడపిల్లననిపిస్తుంది. నాకు తెలియకుండానే నేను అచ్చం ఆడపిల్లలానే ప్రవర్తిస్తుంటాను. కొన్ని సార్లు నేను ఆడపిల్లనా, మగ పిల్లవాడినా కూడా నాకు అర్థం కాదు. ఇంతకుమించి నాకు ఏమీ తెలియదు’ అని అన్నీ బుధవారం మీడియాతో వ్యాఖ్యానించింది.

‘మా అమ్మాయి లేదా అబ్బాయి రోజుకోరకంగా ప్రవర్తిస్తున్నారు. ఒక రోజు అబ్బాయిలా, మరో రోజు అమ్మాయిలా మారిపోతున్నారు. ఒక్కొక్కసారి రెండూలా ప్రవర్తిస్తున్నారు. వైద్యులకు చూపించినా సమస్య పరిష్కారం అవడం లేదు. వయస్సు పెరుగుతున్నా కొద్దీ మగవాడిలా లేదా ఆడామెలా బలమైన లక్షణాలు ఏర్పడతాయని వైద్యులు చెబుతున్నారు. శారీరకంగా కంటే మానసికంగానే ఆడ లేదా మగ లక్షణాలు ఎక్కువ ఉంటున్నాయి’ అని అన్నీ తల్లి మారిట వివరించారు. మొదట్లో అన్నీకి ఏ దుస్తులు కొనాలన్నది పెద్ద సమస్యగా ఉండేదని, అందుకనే రెండు రకాల దుస్తులు కొనడం అలవాటు చేసుకున్నామని ఆమె చెప్పారు.

 అన్నీకి స్కూల్లో కూడా సమస్యలు వస్తున్నాయి. ఓ రోజు బాయ్స్ టాయ్‌లెట్‌లోకి వెళితే మరో రోజు గర్ల్స్ టాయ్‌లెట్‌లోకి వెళ్లడం అన్నీకే కాకుండా తోటి పిల్లలకు ఇబ్బందిగా తయారయింది. అమ్మాయిలు, అబ్బాయిలతో కలుపుగోలుగా తిరగడం కూడా అన్నీకి ఇబ్బందిగా ఉంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement