ఆప్ఘనిస్తాన్: కాబూల్లోని స్పెయిన్ రాయబార కార్యాలయం సమీపంలో శుక్రవారం తాలిబన్ ఉగ్రవాదులు జరిపిన దాడుల్లో ఓ స్పానిష్ పోలీస్ అధికారి మరణించాడు. ఈ మేరకు స్పెయిన్ ప్రధాని మారయానో రజోయ్ తన పార్టీ ట్విట్టర్ అకౌంట్లో పేర్కొన్నారు. తొలుత దాడిలో గాయపడిన పోలీస్ అధికారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు.
వివిధ దేశాలకు చెందిన రాయబార కార్యాలయాలు ఉన్నటువంటి, అధిక భద్రత గల ప్రాంతంలో ఉగ్రవాదులు కారుబాంబుతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడుల్లో మరో ఏడుగురు పౌరులు గాయపడ్డారు. అయితే కారుబాంబు దాడి తమ దేశ రాయబార కార్యాలయం లక్ష్యంగా జరగలేదని స్పెయిన్ ప్రధాని వెల్లడించారు.