న్యూయార్క్: హ్యారీపోర్టర్ సినిమా చూశారా.. అందులో హీరో అప్పుడప్పుడు మాయం అవుతూ ఉంటాడు.. దీనికి కారణం హీరో వీపు వెనుక ధరించే పరదా వంటి వస్త్రం.. అలాంటి వస్త్రమే మనకు దొరికితే.. ఎంచక్కా మాయమై పోవచ్చు కదా.. అయినా అది సినిమా.. నిజంగా ఉంటుందా అనే కదా మీ అనుమానం. అది త్వరలోనే నిజం కానుంది. కాంతిని అధ్యయనం చేసే శాస్త్రవేత్తలు అలాంటి సాంకేతికతనే అభివృద్ధి చేశారు. వస్తువుపై పడే కాంతి తరంగాల పౌనఃపున్యాన్ని మార్చడం ద్వారా ఈ సాంకేతికతను తయారుచేశారు. దీంతో ఏ వస్తువునైనా అన్ని దిశల నుంచి కనిపించకుండా అంటే మాయం చేయొచ్చన్న మాట.
కాంతి గురించి అధ్యయనం చేసే ‘ది ఆప్టిక్ సొసైటీ’అనే కంపెనీ కొత్త పరికరాన్ని అభివృద్ధిపరిచింది. ‘స్పెక్ట్రల్ ఇన్‌విజిబిలిటీ క్లోక్’అని పిలిచే ఈ పరికరంతో ఏ వస్తువునైనా కనిపించకుండా చేయొచ్చు. ఈ పరికరం కాంతి పౌనఃపున్యాన్ని మారుస్తుందన్న మాట. ఇప్పటి వరకు ఒకే రంగు కాంతి వచ్చే వస్తువులను మాత్రమే మాయం చేసే సాంకేతికత ఉంది. అయితే తాజాగా అభివృద్ధి పరిచిన సాంకేతికతతో అన్ని రంగులున్న వస్తువులను కూడా మాయం చేయగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ వివరాలు ఆప్టికా అనే జర్నల్‌లో తాజాగా ప్రచురితమ య్యాయి. అయితే దీన్ని మరింత అభివృద్ధి పరచాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్త జోస్ అజానా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment