
దగ్గు లేదా జలుబు చేసినప్పుడు పాలల్లో మిరియాలు వేసి.. వేడి చేసుకుని తాగుతుంటారు. అది కూడా చాలా అయిష్టంగానే. మీరు కూడా చిన్నప్పుడు అమ్మ బలవంతం మీదనో.. నాన్న అంటే భయంతోనో గుటుక్కున్న మింగేసి ఉంటారు. ఇప్పుడు ఫ్రెండ్స్‌తో ఎంచక్కా ఎంజాయ్ చేసుకుంటూ లాగించేయొచ్చు. ఎలా అంటే.. మిరియాల ఫ్లేవర్‌తో కొత్త బీరు అందుబాటులోకి రానుంది. ఇది ప్రపంచంలోనే తొలి మిరియాల ఫ్లేవర్ ఉన్న బీరు.
డాగ్ ఫిష్ బ్రూవరీ అనే కంపెనీ దీన్ని తయారు చేసింది. దీనికి ‘ఇన్ యువర్ మేస్’ అని పేరు పెట్టారు. ఇలాంటి కొత్త కొత్త ప్రయోగాలకు ఈ కంపెనీ పెట్టింది పేరు. వెరైటీగా అంతరిక్షం నుంచి సేకరించిన దుమ్ము ధూళితో కూడా ఓ బీరు మోడల్‌ను తయారు చేసింది. అయితే వీటిని చాలా తక్కువ మొత్తంలో తయారు చేశారు. ఆ సంస్థ వ్యవస్థాపకులు శాం కాలాగియోన్, ఎరిక్ క్రాఫోర్డ్ ఇద్దరూ చిన్నప్పటి స్నేహితులు. పలు ఫ్లేవర్లతో బీర్లు తయారు చేస్తే ఎలా ఉంటుందని వీరిద్దరికీ ఓ రోజు ఆలోచన తట్టిందట. ఆ తర్వాత సంస్థ స్థాపించడం.. పాలు, కాఫీ, చక్కెర ఇలా అనేక రకాలుగా బీరును తయారు చేస్తూ వస్తున్నారట.