విద్యార్థులు గన్ తెచ్చుకోవచ్చు
షికాగో: తమ వెంట తుపాకులను రక్షణగా తెచ్చుకునేందుకు విద్యార్థులు, ఉపాధ్యాయులకు అమెరికాలోని కన్సాస్ రాష్ట్రం అనుమతి ఇచ్చింది. అన్ని ప్రజా భవనాల్లోకి తుపాకీలను వెంట తీసుకెళ్లేందుకు అనుమతి ఇస్తూ నాలుగేళ్ల కిందట చట్టం చేసినప్పటికీ.. కాలేజీల్లోకి తీసుకెళ్లేందుకు తాజాగా అనుమతినిచ్చారు. ఇప్పటికే అర్కన్సాస్, జార్జియా సహా పలు రాష్ట్రాల విద్యార్థులు తమ వెంట తుపాకులు తెచ్చుకునేందుకు అనుమతులివ్వగా.. తాజాగా ఆ జాబితాలోకి కన్సాస్ రాష్ట్రం చేరింది.
ఇక కాలిఫోర్నియా, దక్షిణ కరోలినా సహా మొత్తంగా 16 రాష్ట్రాలు విద్యార్థులు, ఉపాధ్యాయులు తుపాకులు వెంట తీసుకెళ్లడాన్ని నిషేధించాయి. మరోవైపు తుపాకీలను వెంట తెచ్చుకునే నిబంధన తీసుకురావడంతో కన్సాస్‌లోని వర్సిటీల్లో పనిచేసే కొంతమంది అధ్యాపకులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారని స్థానిక టీవీ రిపోర్ట్ చేసింది. ‘నేను వేరే ఉద్యోగం కోసం వెతుకులాట ప్రారంభించాను. తుపాకులు వెంట తెచ్చుకునే విద్యార్థులకు పాఠాలు బోధించలేను. ఎందుకంటే అదో పిచ్చిపని’ అని కన్సాస్ స్టేట్ వర్సిటీ అధ్యాపకుడు ఫిలిప్ నెల్ పేర్కొన్నారు.