న్యూఢిల్లీ: వెనుకబడిన దేశాల్లోని మహిళలకు మొబైల్ ఫోన్లు అందించడం ద్వారా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకోవచ్చని మెక్‌గిల్ యూనివర్సిటీ(కెనడా), యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్(ఇంగ్లండ్), బొకోని యూనివర్సిటీ(ఇటలీ) పరిశోధకులు అభిప్రాయపడ్డారు. స్మార్ట్‌ఫోన్ల వాడకం మహిళా సాధికారికతకు దోహదపడుతుందని.. సొంతంగా నిర్ణయాలు తీసుకునేలా వారిని ప్రోత్సహిస్తుందని వెల్లడించారు. లింగ వివక్ష, వ్యక్తిగత శుభ్రత, గర్భనిరోధక విధానాలు, ఇతరత్రా ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అభివృద్ధి పరంగా వెనుకబడిన దేశాలైన అంగోలా, బురుండి, ఇథియోపియా, మలావీ, టాంజానియా, ఉగాండ, జింబాబ్వే తదితర దేశాల్లో దాదాపు లక్ష మంది మహిళల అభిప్రాయాలను సేకరించి ఈ మేరకు విశ్లేషించినట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన విషయాలను ప్రఖ్యాత ‘ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ ది సైన్సెస్’ జర్నల్‌లో పొందుపరిచారు.
ఈ మార్పు హర్షణీయం
ఈ నేపథ్యంలో ఉప సహారా దేశాల్లోని ఫోన్ వాడుతున్న మహిళలు మిగతా మహిళలతో పోలిస్తే, గర్భం దాల్చే విషయంలో భాగస్వామితో చర్చించి.. నిర్ణయం తీసుకునే అవకాశం 1 శాతం ఎక్కువగా ఉందని తేలిందన్నారు. అదే విధంగా 2 శాతం మంది అవాంఛిత గర్భనిరోధక విధానాలు, 3 శాతం మంది హెచ్‌ఐవీ టెస్టు ఎలా చేయించుకోవాలన్న విషయాలపై ఫోన్ల వాడకం ద్వారా అవగాహన పొందుతున్నారని తెలిపారు. అదే విధంగా కుటుంబ వ్యవహారాల్లో కూడా తమ వంతు పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు.(మీ ముద్దు మాకొద్దు)
ముఖ్యంగా ఐసోలేటెడ్ ఏరియాల్లో నివసిస్తున్న పేద మహిళల్లో ఈ మేరకు మార్పు రావడం హర్షించదగ్గ విషయమన్నారు. ఇక విషయం గురించి పరిశోధక బృందంలో ఒకరైన ప్రొఫెసర్ లుకా మారియా పెసాండో మాట్లాడుతూ.. ‘‘విద్యా సంస్థల స్థాపన- విస్తరణ, ఆర్థిక పురోగతికై చర్యలు తదితర అంశాలతో పాటుగా వెనుక బడిన దేశాల్లో మొబైల్ ఫోన్లు, సాంకేతికతను అభివృద్ధి చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు పొందవచ్చని మా పరిశోధనలో తేలిందని పేర్కొన్నారు.
ఆ విషయంలో కాస్త వెనుకబడే ఉన్నారు
ఇదిలా ఉండగా.. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మొబైల్ నెట్‌వర్క్‌ల విస్తరణ పెరుగుతున్పప్పటికీ పురుషులతో పోలిస్తే.. సొంతంగా ఫోన్లు కలిగి ఉన్న మహిళలు తక్కువ మందే ఉన్నారని పరిశోధన బృందం పేర్కొంది. కొంతమంది మహిళల చేతిలో ఫోన్ ఉన్నా దానిని ఎలా వినియోగించాలో తెలియక తికమక పడుతున్నారని, మగవారితో పోలిస్తే కమ్యూనికేషన్ స్కిల్స్, సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో కాస్త వెనుకబడి ఉన్నారని అభిప్రాయపడింది.
Comments
Please login to add a commentAdd a comment