పాక్ ప్రధానితో సుష్మా భేటీ
ఇస్లామాబాద్: భారత విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీప్‌ను కలిశారు. బుధవారం మధ్యాహ్నం తర్వాత ఆమె ఆయనతో భేటీ అయ్యారు. ఆసియా దేశాల ప్రాంతీయ సదస్సు 'హార్ట్ ఆఫ్ ఆసియా' కారక్రమంలో పాల్గొనేందుకు మంగళవారం సుష్మాస్వరాజ్ ఇస్లామాబాద్ వెళ్లిన విషయం తెలిసిందే. అదే రోజు కార్యక్రమం కూడా ప్రారంభమైంది. పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తున్న ఈ 5వ సదస్సులో 14 సభ్య దేశాలు, 17 మిత్రదేశాలు, 12 అంతర్జాతీయ, ప్రాంతీయ సంస్థలు పాల్గొంటున్నాయి. రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సులో భారత ప్రతినిధి బృందానికి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ నేతృత్వం వహిస్తున్నారు.
ఈ సందర్భంగా మర్యాదపూర్వకంగా ఆమె షరీఫ్ ను కలిశారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఆమె పాకిస్థాన్ విదేశాంగ మంత్రి సర్తాజ్ అజీజ్ తో కూడా భేటీ అవ్వనున్నారు. షరీఫ్ తో భేటకంటే ముందు ఆమె ఇరు దేశాల మరింత స్నేహభావంతో మెలుగుతూ వర్తక వాణిజ్యాలను పెంపొందించుకోవాలని, ఈవిషయంలో ఇరు దేశాలు కూడా పరిపక్వతతో ఆలోచించాలని చెప్పిన విషయం తెలిసిందే.