ప్రతీకాత్మక చిత్రం
కాబూల్: అఫ్గనిస్తాన్‌లో తాలిబన్లు మరోసారి రెచ్చిపోయారు. కారు బాంబుతో దాడి చేసి లోపలికి ప్రవేశించి భద్రతా బలగాలపై విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో సుమారు పది మంది మృత్యువాత పడ్డారు. ఉత్తర అఫ్గనిస్తాన్‌లోని సమంగన్ ప్రావిన్స్ రాజధాని ఐబక్‌లోని ప్రభుత్వ కార్యాలయం వద్ద సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంటలిజెన్స్ ప్రధాన విభాగమైన నేషనల్ సెక్యూరిటీ డైరెక్టరేట్‌పై దాడి జరిగిందని, కారు బాంబుతో ముష్కరులు విరుచుకుపడ్డారని ప్రభుత్వ అధికార ప్రతినిధి మహ్మద్ సెదిక్ అజీజీ తెలిపారు.
ఇక ఈ విషయం గురించి సమంగన్ గవర్నర్ అబ్దుల్ లతీఫ్ ఇబ్రహీమి మాట్లాడుతూ.. 10 మంది భద్రతా బలగాల సభ్యులు మరణించారని తెలిపారు. అంతేగాకుండా భద్రతా సిబ్బందితో పాటు సామాన్య పౌరులకు గాయాలయ్యాయని.. మొత్తంగా 54 మంది క్షతగాత్రులయ్యారని పేర్కొన్నారు. మరోవైపు.. ఈ ఘటనకు తామే బాధ్యులమని తాలిబన్ సంస్థ ప్రకటించింది. (అఫ్గాన్‌లో ఆత్మాహుతి దాడి; ఏడుగురి మృతి)
కాగా దశాబ్దకాలంగా అఫ్గనిస్తాన్‌లో కొనసాగుతున్న యుద్ధానికి స్వస్తి పలుకుతూ అమెరికా తాలిబన్లతో ఈ ఏడాది శాంతి ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అక్కడి నుంచి తన సైనిక బలగాలను వచ్చే 14 నెలల్లో ఉపసంహరిస్తామని... అంతేగాక జైలు శిక్ష అనుభవిస్తున్న తాలిబన్లను విడుదల చేయాలని అక్కడి ప్రభుత్వానికి షరతు విధించింది. ఈ నేపథ్యంలో దశల వారీగా తాలిబన్లను విడుదల చేసేందుకు అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ మార్చిలో గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు ఇరు వర్గాల మధ్య చర్చలు జరుగుతున్న నేపథ్యంలో తాలిబన్లు ఇటీవల వరుసగా ఉగ్రదాడులకు పాల్పడుతూ విధ్వంసం సృష్టిస్తున్నారు. ఆదివారం కుందుజ్ ప్రాన్స్‌లోని చెక్‌పాయింట్ల వద్ద దాడులకు తెగబడటంతో 14 మంది భద్రతా బలగాల సిబ్బంది మృతి చెందారు.
Comments
Please login to add a commentAdd a comment