మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ కు.. కాంట్రాక్ట్ కష్టాలు!
మూడేళ్ళ వయసునుంచే మోడలింగ్ ఫీల్డ్ లో ప్రతిభను ప్రదర్శించిన ఆ చిన్నారి... ప్రపంచంలోనే మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ గా పేరొందింది. డాల్సీ అండ్ గబ్బనా.... రాబర్ట్ కావిల్లా.... అర్మానీ వంటి ఎంతోమంది ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లతో పని చేసింది. పదేళ్ళ వయసున్న ఆ రష్యా చిన్నది... ఇప్పుడు అమెరికాకు చెందిన టాప్ మోడలింగ్ కాంట్రాక్ట్ విషయంలో సమస్యను ఎదుర్కొంటోంది.
రష్యాలో జన్మించిన లిటిల్ సూపర్ మోడల్... 'ఎల్ ఏ మోడల్స్ యూత్' సెక్షన్ కాంట్రాక్ట్ కు సైన్ చేసి... ప్రపంచంలోనే ఎంతోమంది అభిమానులను ఆకర్షించింది. అయితే ఆ అభిమానం ఆమె భవిష్యత్తుకు మాత్రం సహకరించేలా కనిపించడం లేదు. ఇంటర్నెట్ లో పోస్ట్ చేసిన క్రిస్టినా ప్రిమెనోవా చిత్రాలు రెచ్చగొట్టేవిగా ఉన్నాయని, ఈ పోకడ సరికాదని కొందరు వ్యాఖ్యానించడం ఇప్పుడు ఆమెకు అడ్డంకిగా మారింది. క్రిస్టినాకు ఫేస్ బుక్ లో సుమారు 20 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు. అయితే చిన్నతనంలోనే ఆమె ప్రతిభా పాటవాలను ప్రోత్సహిస్తున్నవారు కొందరైతే... అసూయ, ఆగ్రహం వ్యక్తం చేసేవారూ అందులో కొనసాగుతున్నారు. కొందరు ఆమె చిన్నపిల్లని చూడకుండా ఆమె శరీరభాగాలపై ఎన్నోఅసభ్య కామెంట్లు కూడా పోస్ట్ చేస్తున్నారు.
ఇటీవల ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫొటోపై ఓ కామెంటర్ తనతో ఉండటం ఇష్టమేనా అన్నాడు. అలాగే కొందరు సెక్సీ లెగ్స్ అన్నారు. అయితే క్రిస్టినా తల్లి 40 ఏళ్ళ గ్లికేరియా పిమెనోవా మాత్రం.. తాను పోస్ట్ చేసిన ఫోటోల్లో ఎలాంటి అసభ్యతా లేదంటోంది. చిన్నారి ధరించిన వస్త్రాలు రెచ్చగొట్టేవిగా లేవని ఆమె వాదిస్తోంది. పసి పిల్లలను అసభ్యంగా చూడటం సరికాదని, తన కూతురు భవిష్యత్తును పాడు చేయొద్దని ఓ పత్రికతో విన్నవించింది. క్రిస్టినా ఫొటోలను తరచుగా ఇన్ స్టాగ్రామ్ లోనూ, ఫేస్ బుక్ లోనూ పోస్ట్ చేసే బాధ్యతను తల్లి గ్లైకేరియా కొనసాగిస్తోంది. కూతురుపై వచ్చే అనుచిత వ్యాఖ్యలను వెంటనే డిలీట్ చేస్తూ, ఆమె పోస్ట్ లు ఛైల్డ్ ఫ్రెండ్లీ గా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటోంది.
క్రిస్టినా ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ పేజీల్లో ఎవరైనా పోస్టు చేసే వీడియోలు, చిత్రాలు, కామెంట్లు.. క్రిస్టినా వయసుకు తగ్గవిగా లేకపోతే డిలీట్ చేయబడతాయని గ్లికేరియా హెచ్చిరిస్తోంది. అంతేకాక పోస్ట్ చేసిన వారిని బ్లాక్ చేస్తామని చెప్తోంది. అయితే ఆన్ లైన్ లో క్రిస్టినా... ఎంతోమంది అభిమానులను కూడగట్టుకున్నా... అతి చిన్న వయసు కావడంతో ఆమెకు సోషల్ మీడియాలో ప్రవేశం ఉండకూడదని కొందరు అభ్యంతరాలు కూడ వ్యక్తం చేస్తున్నారు.