లాస్ ఏంజిలెస్: అమెరికాలో ఓ సాయుధుడు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో నలుగురు చనిపోగా, 12 మంది గాయపడ్డారు. గాయాలపాలైనవారిలో ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుల్లో అతని రూమ్‌మేట్‌తో పాటు ఓ మహిళ ఉన్నారు. ఉత్తర కాలిఫోర్నియాలోని ఓ గ్రామీణ ప్రాంతంలో మిలిటరీ దుస్తుల్లో ఓ దుండగుడు మంగళవారం ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
ఓ పాఠశాలతో పాటు మరికొన్ని ప్రాంతాలను అతడు లక్ష్యంగా చేసుకున్నాడు. ఆ తరువాత భద్రతా దళాలు ఆ సాయుధుడిని హతమార్చాయి. దాడికి పాల్పడిన వ్యక్తిని కెవిన్ నీల్‌గా గుర్తించారు. పొరుగింట్లో ఉంటున్న వ్యక్తిని కత్తితో పొడిచాడన్న ఆరోపణలపై అరెస్టయిన అత ను ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నాడు. అయినా నీల్‌కు ఆయుధాలు అందుబాటులో ఉండటంపై స్థానికులు సందేహం వ్యక్తం చేశారు. ఇరుగుపొరుగు వారితో గొడవలతో విసిగిపోయి అతడు కాల్పులకు దిగినట్లు అధికారులు భావిస్తున్నారు.
కారులో ప్రయాణిస్తూ కాల్పులు
పది రోజుల క్రితం టెక్సాస్‌లో చర్చిపై జరిగిన దాడిలో 26 మంది చనిపోయిన ఘటనను మరువక ముందే అమెరికా మరోసారి కాల్పులతో ఉలిక్కిపడింది. విస్తరిస్తున్న తుపాకీ సంస్కృతిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న సమయంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 8 గంటల నుంచి రాంచో తెహమా రిజర్వుతో పాటు ఓ స్కూలు సహా ఇతర ప్రాంతాల్లోనూ నీల్ కాల్పుల పరంపర కొనసాగింది. కనిపించిన ప్రతి ఒక్కరిపై బుల్లెట్లు ఎక్కుపెట్టాడు. సొంత రూమ్‌మేట్‌పై కూడా కాల్పులు జరిపాడు. మొదట పక్కింటి వ్యక్తి కారు దొంగిలించి దానిలో ప్రయాణిస్తూనే కాల్పులకు తెగబడ్డాడు.
ఆ తరువాత ఓ ఎలిమెంటరీ స్కూలులోకి చొరబడటానికి ప్రయత్నించినా దాని గేటు మూసివేసి ఉండటంతో అది సాధ్యం కాలేదు. దీంతో నీల్ స్కూలు నుంచి బయల్దేరి కాల్పులు కొనసాగిస్తుండగా ఓ సందర్భంలో అతని వాహనం ప్రమాదానికి గురైంది. అయినా అంతటితో ఆగకుండా మరో కారు దొంగిలించి కాల్పులు జరుపుతూనే ఉన్నాడు. చివరికి సుమారు 100 మందితో కూడిన పోలీసుల బృందం చేతిలో హతమయ్యాడు. అతడు కారులో ప్రయాణిస్తూ విచ్చలవిడిగా కాల్పులకు పాల్పడ్డాడని ప్రత్యక్ష సాక్షి ఒకరు వివరించారు. ఆ గన్‌మన్‌కు నేరచరిత్ర ఉందని తెహమా కౌంటీ అధికారి ఫిల్ జాన్‌స్టన్ చెప్పారు. స్కూలు వద్ద జరిగిన కాల్పుల్లో ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయని, కారులో ప్రయాణిస్తున్న ఓ విద్యార్థి తల్లి తీవ్రంగా గాయపడిందని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment