సిడ్నీ: ఊరవతలి దిబ్బపైనున్న శ్మశానంలో ఎండుటాకుల మధ్య నిట్ట నిలువుగా నిలబెట్టిన సమాధి రాళ్లను చూస్తే పగలే భయం వేస్తుంది. ప్రేతాత్మలను నమ్మే వారి సంగతి ఇక చెప్పక్కర్లేదు. అలాంటి చోటుకు వెళ్లి గతించిన ఆత్మీయులను తలచుకోవాలంటే, వారికి శ్రద్ధాంజలి ఘటించాలంటే గుండెల్లో గుబులు తప్పదు. ఆధునిక జీవన శైలిలో భాగంగా శ్మశానాలు కూడా ఇప్పుడు సుందర నందన ఉద్యాన వనాలుగా మారిపోతున్నాయి. ఇప్పటికే కొన్ని దేశాల్లో సమాధి రాళ్ల స్థానంలో చెట్లు పుట్టుకొచ్చాయి.
ఆత్మీయులను సమాధి చేసిన చోట పెంచుతున్న మొక్క ఏపుగా పెరుగుతుందా, లేదా ? ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు, అసలు ఆ మొక్క ఎక్కడుందో గుర్తించేందుకు మొబైల్ యాప్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు ఆస్ట్రేలియాకు చెందిన ఓ కంపెనీ అదే కోవలో ఎకో ఫ్రెండ్లీ శ్మశానానికి డిజైన్ చేసింది. పరిసరాలు అహ్లాదకరంగా ఉండేందుకు చుట్టూ చెట్లు నాటినా, శ్రద్ధాంజలికి సంబంధించిన సంస్కారాలు చేసేందుకు వీలుగా సమాధి స్థలాన్ని ఖాళీగానే వదిలేస్తున్నారు. వాటిపై సమాధి రాళ్లు కూడా ఉండవు. పేరు, ఊరు రాసి మార్కు చేసి కూడా ఉండదు. అయితే ఎవరి సమాధి ఎక్కడుందో గుర్తించేందుకు వీలుగా జీపీఎస్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఆ వ్యవస్థ ద్వారా సమాధుల జాడ కచ్చితంగా తెలుసుకోవచ్చు.
సిడ్నీకి శివారులో ఓ 25 ఎకరాల స్థలంలో ‘అకేషియా రిమంబ్రెన్స్ సాంక్చరీ’ అనే సంస్థ, సిడ్నీలోని క్రోఫీ ఆర్కిటెక్ట్స్‌తో కలసి ఉద్యానవనం లాంటి ఈ ఎకో ఫ్రెండ్లీ శ్మశానాన్ని నిర్మిస్తోంది. అందమైన ల్యాండ్ స్కేప్‌తోపాటు గలగలపారే సెలయేళ్లు, వివిధ రకాల పుష్పాలతో బంధువులు సేదతీరేందుకు ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తున్నామని సాంక్చరీ యజమానులు తెలియజేస్తున్నారు. లండన్‌లో కూడా ఇలాంటి ఓ శ్మశాన్ని నిర్మించే ప్రతిపాదన ఉందని వారు చెప్పారు.
ఉద్యాన వనాలుగా శ్మశానాలు
Published Tue, May 31 2016 6:28 PM | Last Updated on Mon, Sep 4 2017 1:21 AM
Advertisement