
పేరు అలా కలిసొచ్చింది..!
ఎలిజబెత్ గల్లాగెర్ అని పేరు ఉండటంతో ఈ యువతి పంట పండింది.. ఉచితంగా ప్రపంచ పర్యటనకు వెళ్లే చాన్స్ కొట్టేసింది. ఇంతకీ మ్యాటరేం టంటే.. కెనడాకు చెందిన జోర్డాన్ అక్సానీ తన ప్రేయసితో కలిసి ఈ క్రిస్మస్‌కు ప్రపంచ పర్యటనకు వెళ్దామని గతేడాదే విమాన టికెట్లు కొనేశాడు. ఈలోగా వారిద్దరి మధ్యా అభిప్రాయభేదాలొచ్చి విడిపోయారు. కానీ టికెట్లు అలాగే ఉండిపోయాయి. వాటిని రద్దు చేయడమూ కుదరదు.
పేరు మార్చుకోవడానికీ వీల్లేదు. వాటిని అలా వేస్ట్ చేయడం నచ్చని జోర్డాన్‌కు ఓ ఐడియా వచ్చింది. వెంటనే సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో ప్రకటన ఇచ్చాడు. తన ప్రియురాలి పేరు (ఎలిజబెత్ గల్లాగెర్), కెనడా పాస్‌పోర్టు కలిగి ఉండి, ప్రపంచాన్ని చుట్టి రావాలని కోరిక ఉన్న ఏ యువతి అయినా ఈ టూర్‌కు ఫ్రీగా రావొచ్చని ఆఫర్ ఇచ్చాడు. ఇష్టం ఉంటే తనతో కలిసి రావొచ్చని, ఒకవేళ తనతో కలిసి రావడం ఇష్టం లేకున్నా, విమాన టికెట్లు ఇచ్చేస్తానని, సొంతంగానే వెళ్లొచ్చని పేర్కొన్నాడు.
నోవా స్కాటియాకు చెందిన 23 ఏళ్ల ఎలిజబెత్ గల్లాగెర్ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంది. తాను వస్తానంటూ జోర్డాన్‌ను సంప్రదించింది. డిసెంబర్ 21న న్యూయార్క్ నుంచి ప్రారంభమయ్యే వీరి ప్రయాణం.. మిలాన్, ప్రేగ్, పారిస్, బ్యాంకాక్, ఢిల్లీ మీదుగా తిరిగి టొరంటోతో ముగుస్తుంది. ఇంతవరకు బాగానే ఉంది కానీ, తన ప్రియురాలు జోర్డాన్‌తో కలిసి వెళ్లడం గల్లాగెర్ బాయ్‌ఫ్రెండ్‌కు సుతరామూ ఇష్టంలేదట. కానీ ఆమె అతడిని ఒప్పించి, ఈ ప్రపంచయానానికి సన్నద్ధమవుతోంది.