ఈ పాము పగ తీరలేదా?
సమస్యలను అధిగమించలేక, కష్టాలకు భయపడి మనుషులు ఆత్మహత్య చేసుకోవడం మనకు తెలుసు. మరి జంతువులు కూడా ఇలా బలవన్మరణానికి పాల్పడతాయా? తమ ప్రాణాన్ని తామే తీసుకుంటాయా? ఈ చిత్రంలోని పామును చూస్తే అది నిజమేమో అనిపించక మానదు.
ఆస్ట్రేలియాలోని కెయిన్స్‌కు చెందిన ఓ మహిళ తన ఇంటి డోర్ దగ్గర ఓ సర్పాన్ని చూసింది. ఎంతసేపటికీ అది అక్కడి నుంచి కదలకపోవడంతో పాములను పట్టే నిపుణుడు మట్ హాగన్‌కు ఫోన్ చేసింది. వెంటనే అక్కడకు చేరుకున్న అతడు.. అక్కడి దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఆ సర్పం తనను తానే కరుచుకుని చనిపోయి ఉండటాన్ని చూసి నమ్మలేకపోయాడు.
గత పదేళ్లుగా పాములు పడుతున్న తాను ఇలాంటి సంఘటన ఇంతవరకు చూడలేదని హాగన్ పేర్కొన్నాడు. పాములు పగ పడతాయని, పగ తీరకపోతే బండరాయికి తల పగలగొట్టుకుని చనిపోతాయని మన జనబాహుళ్యంలో ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. మరి ఈ సర్పం అందుకే చనిపోయిందా? లేక ఏదైనా కష్టం వచ్చి ఇలా ప్రాణాలు తీసుకుందా? అన్నవి జవాబు లేని ప్రశ్నలే.