
న్యూయార్క్: లైంగిక వేధింపులు, దాడులను ధైర్యంగా ప్రపంచం దృష్టికి తీసుకొచ్చిన ‘సైలెన్స్ బ్రేకర్స్’ను టైమ్ మేగజీన్ ఈ ఏడాది ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా ప్రకటించింది. హాలీవుడ్ నిర్మాత హార్వే వీన్‌స్టెయిన్ లైంగికంగా వేధించాడంటూ ఇటీవల పలువురు నటీమణులు, మోడళ్లు ప్రకటించడంతో సినీ ప్రపంచం కుదుపునకు లోనైన సంగతి తెలిసిందే. హార్వేపై ఆరోపణలు చేసిన వారితో పాటు, లైంగిక దాడులకు గురయ్యామని ప్రపంచ వ్యాప్తంగా ‘మీ టూ హ్యాష్‌ట్యాగ్’ ద్వారా తమ బాధలను పంచుకున్న మహిళలందరినీ ‘సైలెన్స్ బ్రేకర్స్’గా పరిగణిస్తున్నారు. ఈ ఏడాది ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’ రేసులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో స్థానంలో నిలిచారు.
‘పెటా’ జాబితాలో సెల్ఫీ కోతి
జకార్తా: నేచర్ ఫొటోగ్రాఫర్ కెమెరాతో సెల్ఫీ తీసుకుని ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించిన ఇండోనేసియా కోతి ‘నరుటో’ ఈ ఏడాది ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా ఎంపికైంది. మకక్వీ జాతికి చెందిన ఆరేళ్ల నరుటోను ‘పెటా’ సంస్థ ఈ అవార్డుకు ఎంపిక చేసింది. 2011లో బ్రిటిష్ ఫొటోగ్రాఫర్ డేవిడ్ స్లేటర్ అడవిలో అమర్చిన కెమెరాను చేతిలోకి తీసుకుని ఈ కోతి తెలీకుండా చకాచకా కొన్ని సెల్ఫీలు తీసుకున్న సంగతి తెలిసిందే.