ఐసిస్ భారత చీఫ్ షఫీ హతం!
సిరియాలో అమెరికా డ్రోన్ దాడిలో మృతి
న్యూఢిల్లీ: ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) ఉగ్రవాద సంస్థ భారత విభాగం చీఫ్ మహమ్మద్ షఫీ అర్మార్ అలియాస్ యూసుఫ్ ఇటీవల సిరియాలో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో హతమైనట్లు తెలుస్తోంది. ‘అతడు మృతి చెందినట్లు తెలిసింది.ఐసిస్ ప్రాబల్యమున్న సిరియా నుంచి సమాచారం రావడానికి కొంత సమయం పట్టొచ్చు’ అని భారత ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఐసిస్ అధినేత అబూ బకర్ అల్ బాగ్దాదీకి ముఖ్య సన్నిహితుడైన షఫీ(26) భారత్‌లో ఐసిస్ విభాగాన్ని పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసేందుకు సహకరిస్తున్నాడు. అతడు 30 మందిని ఈ ఉగ్రవాద సంస్థలో చేర్పించినట్లు సమాచారం.
భారత్‌లో ప్రతి రాష్ట్రంలో ఐసిస్ శాఖ ఏర్పాటుకు అతడు ప్రణాళిక వేశాడని భారత్‌లో అరెస్టయిన ఐసిస్ ఉగ్రవాదులు విచారణలో వెల్లడించినట్లు అధికారులు చెప్పారు. షఫీ ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా వేదికల్లో దాదాపు 700 మంది భారతీయ యువకులతో సంబంధాలు నెరుపుతున్నట్లు నిఘా అధికారులు చెప్పారు. కర్ణాటకలోని భక్తల్‌కు చెందిన షఫీ అన్న సుల్తాన్ అర్మార్ కూడా గత ఏడాది వరకు ఐసిస్ భారత విభాగానికి నాయకత్వం వహించాడు. 2015 మార్చిలో అమెరికా ద్రోన్ దాడిలో హత మయ్యాడు.