మోదీ పర్యటన చరిత్రాత్మకం | 'Truly Historic' Visits By President Trump, PM Narendra Modi: Israeli Prime Minister | Sakshi
Sakshi News home page

మోదీ పర్యటన చరిత్రాత్మకం

Published Thu, Sep 21 2017 1:42 AM | Last Updated on Fri, Aug 24 2018 1:52 PM

'Truly Historic' Visits By President Trump, PM Narendra Modi: Israeli Prime Minister

ఐరాస సమావేశంలో ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూ

ఐక్యరాజ్యసమితి:  భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తమ దేశంలో పర్యటించడం చరిత్రాత్మకమని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ పేర్కొన్నారు. ఆయన బుధవారం ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీలో ప్రసంగిస్తూ ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఇజ్రాయెల్, భారత్‌కు అంతులేని అవకాశాలున్నాయని మోదీతో సమావేశమయ్యాక గుర్తించామని తెలిపారు. ‘గతేడాది కూడా నేను ఇదే వేదికపై ప్రసంగిస్తూ ప్రపంచం పట్ల ఇజ్రాయెల్‌ ధోరణిలో వచ్చిన మార్పును వివరించా. అప్పటి నుంచి చాలా పరిణామాలు చోటుచేసుకున్నాయి. అధ్యక్షులు, ప్రధానులు, విదేశాంగ మంత్రులు, ఇతర నాయకులు చాలా మంది ఇజ్రాయెల్‌లో పర్యటించారు.

వారిలో చాలా మందికి అదే తొలి పర్యటన. అందులో రెండు మాత్రం చరిత్రాత్మకం. అవి మోదీ, ట్రంప్‌ల పర్యటనలు. తన తొలి విదేశీ పర్యటనను ఇజ్రాయెల్‌లో చేపట్టిన మొదటి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ నిలిచారు. వేయి ఏళ్ల నాటి యూదు మతస్తుల ఆలయాలను సందర్శించి ఆయన మా మనసులు గెలుచుకున్నారు’ అని నెతన్యాహూ అన్నారు. జూలైలో మోదీ ఇజ్రాయెల్‌లో పర్యటించిన తొలి భారత ప్రధానిగా నిలిచారని చెప్పారు. మోదీతో సమావేశం వివరాలను నెతన్యాహూ ప్రపంచ దేశాల నేతలతో పంచుకున్నారు. ‘మోదీ, నేను సముద్ర తీరంలో ఉన్న చిత్రాలను మీరు చూసి ఉండొ చ్చు. బూట్లు తొలగించి మధ్యధరా సముద్ర తీరం వెంట నడుచుకుంటూ వెళ్లాం’ అని గుర్తుచేసుకున్నారు.

అణ్వస్త్రాల నిషేధానికి ముందడుగు!
ఐక్యరాజ్యసమితి: ఉత్తర కొరియా నుంచి అణు దాడుల ముప్పు నెలకొన్న నేపథ్యంలో అణ్వాయుధాలను నిషేధిస్తూ కొత్త ఒప్పందంపై 51 దేశాలు సంతకాలు చేయనున్నాయి. అమెరికా, బ్రిటన్, రష్యా తదితర అణు దేశాలు ఈ ఒప్పందాన్ని వ్యతిరేకించాయి. ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బ్రెజిల్‌ అధ్యక్షుడు మైకేల్‌ టెమర్‌ ఈ ఒప్పందంపై తొలి సంతకం చేశారు. మరో 50 దేశాలు సంతకం చేస్తే ఇది అమల్లోకి వస్తుంది. ‘మనం ఈరోజు కీలక దశకు చేరుకున్నాం. అణ్వాయుధాలను పూర్తిగా నిర్మూలించడానికి ఇంకా చాలా దూరం ప్రయాణించాలి’ అని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరెస్‌ వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement