
ఆత్మీయ కరచాలనాలు, చిరునవ్వులతో పలకరింపులు, బొటన వేలెత్తి చూపిస్తూ విక్టరీ సంకేతాలు, పక్కపక్కన నిల్చొని ఫోటోగ్రాఫర్లకు పోజులు, ఇలా ఆద్యంతం ఆహ్లాదంగా సాగిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ సమావేశం ఇరువురు నేతలు కలిసి భోజనం చేయడంతో ముగిసింది. ట్రంప్, కిమ్ ఇద్దరూ జోకులు వేసుకుంటూ, నవ్వుకుంటూ డైనింగ్‌రూమ్‌లోకి కలిసి వెళ్లారు. అలా వెళుతూ వెళుతూ ట్రంప్ ఫోటోగ్రాఫర్లని ఉద్దేశించి ‘అందరూ మంచి పిక్ తీసుకున్నారా ? మేమిద్దరం అందంగా, సన్నగా ఉన్నాం కదా‘ అంటూ చమత్కరించారు. ఒక చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైందన్న సంతృప్తితో ఉన్న నేతలిద్దరూ తమ కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన వంటకాలను తృప్తిగా తిన్నారు. పశ్చిమ దేశాలు, ఆసియా దేశాల్లో పేరెన్నిక గన్న రుచుల్ని మెనూలో ఉండేలా చూసుకున్నారు. ట్రంప్, కిమ్ వర్కింగ్ లంచ్‌లో నోరూరించే వంటకాలు ఏమున్నాయంటే ..
రొయ్యల కాక్‌టైల్, అవకాడో సలాడ్, తేనె, నిమ్మకాయ కలిపిన మామిడికాయ కెరబు, దోసకాయని స్టఫ్ చేసి తయారు చేసే ఓయిసన్ అనే కొరియన్ వంటకాన్ని స్టార్టర్‌లుగా ఉంచారు. ఇక మెయిన్ కోర్సులో బీఫ్, పంది మాంసంతో చేసిన ప్రత్యేక వంటకాలు, ఫ్రైడ్ రైస్ విత్ చిల్లీ సాస్, ఆవిరిపై ఉడికించిన బంగాళ దుంపలు, గ్రీన్ గోబీ, కాడ్ అనే చేప, సోయా, ముల్లంగి, ఇతర కాయగూరలతో చేసిన ప్రత్యేక వంటకాలు మెనూలో హైలైట్‌గా నిలిచాయి. వీటితో పాటు రెడ్ వైన్ కూడా ఉంది. ఇక భోజనానంతరం తినే డెజర్ట్స్ విషయానికొస్తే డార్క్ చాక్లెట్, చెర్రీ పళ్లతో డెకరేట్ చేసిన హాజెండాజ్ వెనిలా ఐస్‌క్రీమ్, ట్రోప్‌జెన్నీ అనే కేకులాంటి పదార్థం వడ్డించారు. ట్రంప్‌కి వెనీలా ఐస్‌క్రిమ్ అంటే పిచ్చి. ప్రతీ రోజూ రెండు స్కూప్‌ల ఐస్ క్రీమ్ ఆయన లాగిస్తూ ఉంటారు. ఇక కిమ్ ఆహార అలవాట్ల గురించి బయట ప్రపంచానికి అంతగా తెలీవు. అయితే అతను భోజన ప్రియుడని ముఖ్యంగా చీజ్ ఉన్న విదేశీ వంటకాల్ని ఇష్టంగా తింటారని అంటారు. మొత్తమ్మీద ఈ లంచ్ తక్కువ ఐటమ్‌లతోనైనా ఆహా ఏమి రుచి అనిపించేలా ఉందని అంటున్నారు. ఇక ఈ చారిత్రక సమావేశం కవరేజ్ కోసం వెళ్లిన విలేకరులకు ప్రత్యేకంగా కొరియా స్పెషల్ కిమ్చి ఐస్ క్రీమ్ ఇచ్చారు.
కిమ్-ట్రంప్ : నాలుగు నిర్ణయాలు
Comments
Please login to add a commentAdd a comment