మొత్తం నాశనం చేస్తా.. ఖబడ్దార్!
ఉత్తర కొరియాకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిక
► ఆత్మహత్య మిషన్‌లో కిమ్ జోంగ్ ఉన్
► ఐక్యరాజ్య సమితి వేదికగా ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు
► సహనంగా ఉంటున్నాం.. మా మిత్రులను ఇబ్బందిపెడితే సహించం
► ఉగ్రవాదులకు సాయం వద్దు.. పాకిస్తాన్‌కూ పరోక్ష హెచ్చరిక
► సార్వభౌమత్వానికి కొత్త నిర్వచనమిస్తామన్న ట్రంప్
ఐక్యరాజ్యసమితి: ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ తమను రెచ్చగొడుతూ ఉంటే.. ఆ దేశాన్ని పూర్తిగా నాశనం చేసేందుకు వెనకాడబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు చేశారు. ఉత్తర కొరియాపై కఠినంగా వ్యవహరించేందుకు అన్ని దార్లూ తెరిచే ఉన్నాయని స్పష్టం చేశారు. ఉ.కొరియా అణ్వాయుధాలు, బాలిస్టిక్ క్షిపణులను తయారుచేసుకుంటూ.. మిగిలిన ప్రపంచాన్ని హెచ్చరిస్తూ మానవాళికి ప్రమాదకరంగా మారిందన్నారు. మంగళవారం ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో తొలిసారి ప్రసంగించిన ట్రంప్.. ఉ.కొరియాపై సైనికచర్య ప్రారంభించేందుకు ఏమాత్రం సంకోచించబోమని తేల్చిచెప్పారు.
భూమండలంపై ఏ దేశంలోనూ కిమ్ జోంగ్ ఉన్ వంటి అణ్వాయుధాలు, మిసైళ్లు కలిగిన నేరస్తులుండరన్నారు.కిమ్‌ను రాకెట్ మ్యాన్‌గా సంబోధించిన ట్రంప్.. ‘అమెరికా బలమైన, సహనశీలమైన దేశం. కానీ మా మిత్రులను కాపాడుకునేలా తప్పనిసరి పరిస్థితులు కల్పిస్తున్నారు. మా దగ్గర ఉత్తర కొరియాను పూర్తిగా నాశనం చేయటం మినహా వేరే ప్రత్యామ్నాయం లేదు. రాకెట్ మ్యాన్ ఆత్మహత్య మిషన్‌లో ఉన్నారు’ అని ట్రంప్ హెచ్చరించారు. ‘శాంతి కోసం మేం ఏం చేయటానికైనా సిద్ధంగా ఉన్నాం. కానీ ఇప్పుడా అవసరం లేదనిపిస్తోంది. ఐక్యరాజ్యసమితి ఉన్నదే అందుకోసం. చూద్దాం వారేం చేస్తారో?’ అని ట్రంప్ పేర్కొన్నారు.
అణ్వాయుధాలు పక్కనపెడితేనే..
తమ భవిష్యత్తు బాగుండాలంటే.. అణ్వస్త్రరహితంగా మారటమొక్కటేనని ఉత్తరకొరియా గుర్తించాలన్నారు. ఇటీవలే ఉ.కొరియాపై కఠినమైన ఆంక్షలు విధిస్తూ భద్రతామండలి 15–0తో ఏకగ్రీవంగా ఆమోదించిన విషయాన్నీ ట్రంప్ గుర్తుచేశారు. ఈ ఆంక్షల విషయంలో ముందుకొచ్చిన భద్రతామండలి శాశ్వత సభ్యులు చైనా, రష్యాలకు ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు.
‘దీనిపై మరింత స్పందన అవసరం. మనమంతా కలసి కిమ్ దేశం విరుద్ధమైన ఆలోచనలనుంచి బయటకు వచ్చేంతవరకు ఏకాకిని చేయాలి. ఇది ఒక్క కొరియాకే కాదు.. అమెరికాను చంపేస్తా, ఇజ్రాయిల్‌ను ధ్వంసం చేస్తా, వివిధ దేశాధినేతలను చంపేస్తాననే ప్రతి ఒక్కరితోనూ ఇదే విధంగా వ్యవహరించాలి’ అని ట్రంప్ సమావేశానికి హాజరైన సభ్యదేశాల ప్రతినిధులను కోరారు.
ఉగ్రసాయాన్ని ఉపేక్షించం
ఈ ప్రసంగంలోనే పరోక్షంగా పాకిస్తాన్‌పై ట్రంప్ నిప్పులు కక్కారు. ఉగ్రవాదానికి సాయం చేస్తున్న దేశాలను గుర్తించి వారిని బాధ్యులుగా చేయాలన్నారు. ‘ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని, ఉగ్ర సాయాన్ని ఆపేయాలి. మా దేశానికి, ఆ మాటకొస్తే ప్రపంచానికి సవాల్ విసురుతున్న ఉగ్రవాదాన్ని మేం సహించం. వీరికి సాయంచేస్తున్న దేశాల కుట్రను బట్టబయలు చేయాలి.
అల్‌కాయిదా, హిజ్బుల్, తాలిబాన్ వంటి పలు ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం కల్పించటం, ఆర్థిక, శిక్షణాపరమైన సాయం చేయటాన్ని పూర్తిగా మానుకోవాలని పరోక్షంగా పాక్‌ను హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు అమెరికా, మిత్రదేశాలు సంయుక్తంగా పనిచేస్తున్నాయని స్పష్టం చేశారు. ‘తాలిబాన్ సహా ఇతర ఉగ్రవాద సంస్థలపై అనుసరించిన వ్యూహాన్ని పూర్తిగా మార్చేశాను’ అని ట్రంప్ వెల్లడించారు. గత నెలలో పాక్ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వటం మానుకోవాలంటూ ట్రంప్ నేరుగా తీవ్రస్థాయిలో హెచ్చరించిన సంగతి తెలిసిందే.
అమెరికా ఫస్ట్
తమ ప్రభుత్వం ‘అమెరికా ఫస్ట్’ నినాదంతోనే వెళ్తోందని.. మిగిలిన దేశాలు కూడా తమ తమ ప్రాథమ్యాలను గుర్తించి ముందుకెళ్లాలని ట్రంప్ సూచించారు. ఉమ్మడి సమస్య విషయంలో కలసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. పలు దేశాలు కలసి వివిధ కూటముల ఏర్పాటు కన్నా.. సార్వభౌమ దేశాలుగా ఉండటమే మేలని సూచించారు. సార్వభౌమత్వానికి త్వరలో కొత్త నిర్వచనం ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. ‘మా పౌరులు, వారి అవసరాలు తీర్చటం, వారికి భద్రత కల్పించటం, హక్కులను కాపాడటమే మా ప్రభుత్వ తొలి బాధ్యత. అమెరికా అధ్యక్షుడిగా అమెరికా ఫస్ట్ అనే నినాదాన్ని నేనెప్పటికీ ముందుంచే ప్రయత్నం చేస్తాను’ అని ట్రంప్ చెప్పారు.