
ట్రంప్, హిల్లరీ దూకుడు
5 రాష్ట్రాల్లో ట్రంప్, 4 చోట్ల హిల్లరీ విజయం
ఫిలడెల్ఫియా: డోనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ నామినేషన్ సాధించే దిశగా దూసుకు పోతున్నారు. మంగళవారం కీలక ప్రాంతాలైన మేరీల్యాండ్, కనెక్టికట్, డేలావేర్, పెన్సిల్వేనియా, రోడ్ ఐలాండ్ వెరసి ఐదు రాష్ట్రాల్లో ప్రైమరీ ఎన్నికలు జరిగాయి. ఐదింటిలోనూ ట్రంప్ ప్రత్యర్థులను వెనక్కి నెట్టేసి విజయకేతనం ఎగురవే శారు. హిల్లరీ కూడా ఐదు రాష్ట్రాలకు గాను రోడ్ ఐలాండ్ మినహా నాలుగింటిలో గెలిచారు. కాగా, ఈ ఎన్నికలతో దాదాపు 950 మంది డెలిగేట్లను గెల్చుకున్న ట్రంప్.. రిపబ్లికన్ పార్టీ నామినేషన్ సాధించడానికి కావల్సిన మేజిక్ నంబర్ 1,237కు చేరువవుతున్నారు. మరోవైపు హిల్లరీ కూడా డెమోక్రాటిక్ నామినేషన్ సాధించే దిశగా 2,141 మంది డెలిగేట్ల మద్దతుతో మేజిక్ నంబర్ 2,383కు చేరువలో ఉన్నారు.
ట్రంప్‌పై ప్రియాంక చోప్రా మండిపాటు
డోనాల్డ్ ట్రంప్‌పై బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా మండిపడ్డారు. అమెరికాలో ముస్లింలు ప్రవేశించకుండా నిషేధం విధించాలని ట్రంప్ పిలుపు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. మంగళవారం రాత్రి న్యూయార్క్‌లో జరిగిన టైమ్ 100 గాలాకు ఇద్దరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రియాంక ఉగ్రవాదంపై మాట్లాడుతూ..ఉగ్రవాదాన్ని నిరోధించే క్రమంలో అమెరికాలో ముస్లింలపై నిషేధం విధించడం అనేది అనాగరిక చర్యగా ఆమె అభిప్రాయ పడ్డారు.