
మనకు వేరే మార్గం లేదు: ట్రంప్
వాషింగ్టన్: ఒబామా, హిల్లరీలు అమెరికన్లకు సంబంధం లేని యుద్ధాలు, వివాదాల్లో తలదూర్చి దేశాన్ని సురక్షితం కానిదిగా మార్చారని రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విమర్శించారు. న్యూ హాంప్‌షైర్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన ట్రంప్.. ఒబామా, హిల్లరీల విదేశాంగ విధానంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇతర ప్రజల సరిహద్దుల కోసం పోరాడుతూ అమెరికన్లు ప్రాణాలు, డబ్బు కోల్పోతున్నారని.. అయితే తన మొదటి ప్రాధాన్యత అమెరికాకే ఉంటుందని స్పష్టం చేశారు.
ఇరాక్, సిరియా, లిబియాలలో మారణహోమానికి హిల్లరీనే కారణమని ట్రంప్ మరోసారి విమర్శించారు. సిరియా నుంచి అమెరికాకు ప్రవేశించే శరణార్థుల సంఖ్య 550 శాతం పెరగాలని హిల్లరీ కోరుకుంటున్నారని ట్రంప్ ఆరోపించారు. ఒబామా అనుమతించిన వారి కంటే వేల సంఖ్యలో ఎక్కువమంది వలసదారులను హిల్లరీ అమెరికాలోకి అనుమతించాలని చూస్తున్నారన్నారు. సిరియన్ శరణార్ధుల కార్యక్రమాన్ని నిలిపివేయాలని, రాడికల్ ఇస్లామిక్ ఉగ్రవాదులను దూరంగా ఉంచాలని.. మనకు అంతకన్నా వేరే మార్గం లేదని ర్యాలీలో పాల్గొన్న ప్రజలనుద్దేశించి ట్రంప్ ఉద్వేగభరితంగా ప్రసంగించారు.